మాటకు మాట: రేవంత్ రెడ్డికి ఘాటుగా ఇచ్చి పడేసిన హరీష్ రావు!!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా హరీష్ రావును రాజీనామా చేయాలంటూ చీము, నెత్తురు ఉంటే రాజీనామా చెయ్ అంటూ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా బదులిచ్చారు. ఈరోజు రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా వైరాలో బహిరంగ సభలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామన్నారు.
హరీష్ పై రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు
ఆరోజు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన హరీష్ రావు ఇప్పుడు రాజీనామా చేయాలని, లేదంటే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు రాజీనామా చేస్తే మళ్ళీ ఎలా గెలుస్తాడో చూస్తానంటూ పేర్కొన్న రేవంత్ రెడ్డి సిద్దిపేటలో హరీష్ ను ఓడించే బాధ్యత తనదని సభా వేదికగా సవాల్ చేశారు.

దిగజారుడు భాషలో మాట్లాడితే అబద్ధాలు నిజాలు కావు : హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన హరీష్ రావు నిప్పులు చెరిగారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనే రేవంత్ రెడ్డి లాగా దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి మరొకరు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికొచ్చినట్టు దిగజారుడు భాషలో మాట్లాడితే అబద్ధాలు నిజాలు అయిపోవంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన స్థాయికి తగినట్టుగా ప్రవర్తించడం లేదని హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు.
నిసిగ్గుగా బిఆర్ఎస్ మీద, నా మీద అవాకులు చవాకులు
అబద్ధం కూడా సిగ్గుపడి మూసీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకునేలా రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉందంటూ ఆయన పేర్కొన్నారు. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకొని కూడా మాట మీద నిలబడకపోగా, నిసిగ్గుగా బిఆర్ఎస్ మీద, నా మీద అవాకులు చవాకులు పేలుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 9 నాటికి 40 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానన్నది రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు.
రుణ మాఫీ విషయంలో రేవంత్ నాటకాలు
అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికలకు ముందు మరో నాటకానికి తెరలేపాడని మండిపడ్డారు ఆగస్టు 15వ తేదీ వరకు 31 వేల కోట్లు రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి అందులో తొమ్మిది వేల కోట్లు కోత పెట్టాడని, అయినా ఎవరూ తనను నమ్మడం లేదని ప్రతి ఊరి దేవుడు మీద ప్రమాణాలు చేశాడని ఎద్దేవా చేశారు.
రాజీనామా ఎవరు చెయ్యాలి? ఎవరు ఏట్లో దూకాలి? చెప్పు రేవంత్
అబద్ధమే నా లక్షణం, మోసమే నా విధానం అన్నట్టు నగ్నంగా తన నిజ స్వరూపాన్ని ఈరోజు మరో బట్టబయలు చేసుకున్నాడని హరీష్ రావు మండిపడ్డారు. రుణమాఫీలో మీరేం చేశారో అందరికీ తెలుసని రుణమాఫీ పచ్చి అబద్ధమని తేలిన తరువాత రాజీనామా ఎవరు చేయాలో చెప్పాలని, ఏట్లో దూకి ఎవరు చావాలో చెప్పాలని ప్రశ్నించారు. తెచ్చి పెట్టుకున్న ఆవేశంతో రంకెలేస్తే అబద్దాలు నిజాలు అయిపోవంటూ రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఘాటుగా బదులిచ్చారు.












Click it and Unblock the Notifications