హైదరాబాద్ తోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు: జీహెచ్ఎంసీ అలర్ట్, 3 రోజులు వానలే
హైదరాబాద్ నగరంతోపాటు పలు జిల్లాల్లోనూ గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అమీర్ పేట, బేగంపేట్, పంజాగుట్ట, సికింద్రాబాద్, జేబీఎస్, కోఠి, రాంకోఠి, కింగ్ కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ, హిమాయత్‌నగర్, హైదర్‌గూడ, నారాయణగూడ సహా పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.
ఒక్కసారిగా కురిసిన వర్షానికి వాహనదారులు తడిసి ముద్దయ్యారు. మరోవైపు ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు వాతావరణం చల్లబడటంతో కాస్త ఉపశమనం పొందారు. మరోవైపు, గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతవరణ శాఖ హెచ్చరికలు చేసింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. రోడ్లపై ఎక్కడా నీరు నిలిచిపోకుండా సిబ్బంది రంగంలోకి దిగారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.

హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి. నల్గొండ జిల్లా చండూర్లో రాత్రి కురిసిన వర్షానికి చండూర్ నుంచి మునుగోడు వెళ్లే దారిలోని వాగు ఉద్ధృతంగా ప్రహహిస్తుంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇటు చండూర్ మున్సిపాలిటీలో సైతం రోడ్లన్నీ చెరువులను తలపించాయి. చండూర్ నుంచి మాల్ వెళ్లే దారిలో సైతం నీళ్లు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులు తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలతో పాటు కొన్ని జిల్లాల్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications