హైదరాబాద్‌లో భారీ వర్షం: లోతట్టు ప్రాంతాలు జలమయం
హైదరాబాద్: నగరంలోని పలు చోట్ల శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు కాస్త ఎండగా ఉన్నప్పటికీ.. సాయంత్రం వాతావరణం చల్లగా మారి వర్షం కురిసింది. దిల్‌సుఖ్‌నగర్, సరూర్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, చాదర్ ఘాట్, మలక్‌పేట్, సైదాబాద్, చంపాపేట్, కర్మన్‌ఘాట్, తదితర ప్రాంతాల్లో జోరు వాన కురిసింది.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బేగంపేట, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, దూలపల్లి, బహుదూర్ పల్లి, గండి మైసమ్మ, దుండిగల్, మల్లంపేట్, బేగంపేట్, సూరారం, చింతల్, జీడిమెంట్ల, షాపూర్ నగర్, గాజులరామారంలో వర్షం పడింది.
భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరద నీరు చేరడంతో వాహనదాలులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. భారీ వర్షాల సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు.

ఇది ఇలావుండగా, తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్ర, శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
వర్షంతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు చోట్లు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. కాగా, గత కొద్దిరోజులుగా వరుసగా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం కాస్త చల్లగా మారింది.












Click it and Unblock the Notifications