నేడు, రేపు భారీవర్షాలు.. 11జిల్లాలకు భారీ వర్షసూచన.. ఎక్కడెక్కడంటే!!
వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతాంగానికి, ప్రజలకు ఊపిరి పీల్చుకునే వార్త చెప్పింది వాతావరణ శాఖ. దక్షిణ ఆంధ్రప్రదేశ్ సమీపంలో బంగాళాఖాతం తీరంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
నేడు, రేపు తెలంగాణాలో భారీ వర్షాలు
వర్షాకాలం వచ్చింది. కానీ అనుకున్నంత వర్షాలు కురవటం లేదు. దీంతో ప్రజలు వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం వర్షాకాలంలోనూ ఉక్కపోతను భరిస్తున్న ప్రజలకు వాతావరణ శాఖాధికారుల ప్రకటనలు కాస్త ఊపిరి పోస్తున్నా అనుకున్న మేరకు వర్షాలు కురవకపోవటం ఆందోళన కలిగిస్తుంది. ఇక నేడు, రేపు ఈ రెండు రోజులు తెలంగాణా రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

నేడు 11జిల్లాలలో భారీ వర్షాలకు ఛాన్స్
కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ . నేడు రాష్ట్రంలోని 11 జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
రేపు భారీ వర్షాలు, 11 వ తేదీ వరకు మోస్తరు వర్షాలు
ఈ జిల్లాలతో పాటు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఇక బుధవారం, గురువారాలలో రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఇలా ఉంటే ఆదివారం కూడా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు కురిశాయి.
ఆదివారం అత్యధిక వర్షపాతం ఇక్కడే
అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చాప్రాలలో 4.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక ఇదే జిల్లా భీంపూర్ మండలం అర్లీలో 4.2 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా పిట్లంలో 3.7 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లా నర్సాపూర్ లో 3.6 సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లా చిమన్పల్లి లో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది ఇక రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిశాయి. నేడు తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.












Click it and Unblock the Notifications