హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో సోమశిల, శ్రీశైలం చుట్టేద్దామా..? తక్కువ ధరకే..
నేటి బిజీ లైఫ్ లో.. వీకెండ్ లేదా హాలీడేస్ వచ్చాయంటే చాలు చాలా మంది ఫ్యామిలీతో సరదాగా గడిపేందుకు ఫ్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు దగ్గరగా ఉండే టూరిస్టు ప్రాంతాల కోసం వెతుకుతుంటారు. అయితే భాగ్యనగరానికి అతి దగ్గరలోనే ఉండే టూరిస్టు ప్రదేశాల్లో తెలంగాణ మినీ మాల్దీవులుగా పేరుగాంచిన సోమశిల నగరం ఒకటి. సోమశిల నగరానికి వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. ఈ ప్రాంతానికి వెళ్లేందుకు పర్యాటకులు క్యూ కడుతుంటారు. మరి మీరు కూడా సోమశిల వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్..
తెలంగాణ టూరిజం శాఖ, ఈజీ మై భాగస్వామ్యంతో హైదరాబాద్ కు చెందిన ఆరాధ్య ట్రావెల్స్ గొప్ప సువర్ణావకాశాన్ని అందిస్తోంది. ఈ మేరకు సోమశిల, శ్రీశైలం వెళ్లేందుకు పర్యటకుల కోసం ప్రత్యేకంగా ఎయిర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. తొలిసారిగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా హైదరాబాద్ నుంచి సోమశిల, శ్రీశైలం వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది.
అయితే టూరిస్టుల సౌకర్యార్థం తక్కువ సమయంలో ఆయా ప్రాంతాలను సందర్శించేందుకు వీలుగా హెలికాప్టర్ సేవలను ప్రారంభించింది. సోమశిలలోని పురాతన లలితా సోమేశ్వరుడి ఆలయంతో పాటు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగ క్షేత్రాన్ని సందర్శించుకునేందుకు వీలుగా ఈ టూర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా ఆలయాల్లో ప్రత్యేక వీఐపీ దర్శనం కల్పించనున్నారు. ప్రస్తుతం కంపెనీ సింగిల్ డే, రెండు రోజుల ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
సింగిల్ డే టూర్ ప్యాకేజీలో భాగంగా పర్యటకులు ఉదయం 5 గంటల 30 నిమిషాల వరకు హెలిప్యాడ్ కు చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం 7 గంటల వరకు హెలికాప్టర్ లో సోమశిలకు చేరుకుంటారు. అక్కడి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత కృష్ణా నది అందాలను వీక్షిస్తారు. మళ్లీ 8 గంటల 30 నిమిషాలకు శ్రీశైలానికి బయల్దేరుతారు. అక్కడ భ్రమరాంభ మల్లికార్జున స్వామి ఆలయంలో దర్శనం ఉంటుంది. ఈ ఆలయంలో వీఐపీ దర్శనాన్ని కల్పిస్తారు.

మళ్లీ మధ్యాహ్నం 11 గంటల 30 నిమిషాలకు హెలికాప్టర్ తిరిగి బయలుదేరుతుంది. 12 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ కు చేరుకోవడంతో పర్యటన పూర్తవుతుంది. ఈ టూర్ లో భాగంగా ఫైవ్ స్టార్ వసతిని సైతం అందిస్తోంది. అలాగే ఇక్కడికి వచ్చే పర్యాటకులు కృష్ణా నది తీరంలో బోటింగ్ చేసేందుకు వీలుగా తెలంగాణ పర్యాటకశాఖ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ఈ ప్యాకేజీని బుక్ చేసుకునేందుకు 98667 77771, 98660 13436 నంబర్లకు సంప్రదించాలని నిర్వాహకులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications