Victory Venkatesh: ఖమ్మంలో హీరో వెంకటేష్ రోడ్ షోకు భారీ స్పందన.. ఆయన ఏమన్నారంటే!!
తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు ఎన్నికల ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. ఖమ్మం పార్లమెంటు స్థానానికి రామ సహాయం రఘురామిరెడ్డి కి మద్దతుగా ప్రముఖ నటుడు, రామా నాయుడు తనయుడు విక్టరీ వెంకటేష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రామ సహాయం రఘురామిరెడ్డి కి స్వయానా వియ్యంకుడు అయిన విక్టరీ వెంకటేష్ ఆయన విజయం కోసం నేడు ఖమ్మంలో రోడ్ షో నిర్వహించారు.
వియ్యంకుడి గెలుపు కోసం వెంకటేష్ రోడ్ షో
ఖమ్మం పార్లమెంట్ బరిలో నిలిచిన రామసహాయం రఘురామ్ రెడ్డి కుమారునికి వెంకటేశ్ కుమార్తెనిచ్చి వివాహం చేశారు. దీంతో వీరి మధ్య ఉన్న బంధుత్వం మేరకు సినీ నటుడు వెంకటేష్ ఆయన కోసం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వెంకటేశ్ కుమార్తె తన మామ గారిని గెలిపించాలని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తుండగా నేడు వియ్యంకుని గెలుపు కోసం రెండు జిల్లాల్లో వెంకటేశ్ సైతం ప్రచార పర్వంలో పాల్గొంటున్నారు.

వెంకటేష్ రోడ్ షో కు ప్రజల నుండి భారీ స్పందన
ఈరోజు సాయంత్రం సినీనటుడు విక్టరీ వెంకటేశ్ ఖమ్మం బైపాస్ రోడ్డులోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి చేరుకుని ఆపై సాయంత్రం 5 గంటలకు నగరంలోని మయూరి సెంటర్, పాత బస్టాండ్, జెడ్పీ సెంటర్ మీదుగా ఇల్లెందు క్రాస్ రోడ్డు వరకు రోడ్ షో నిర్వహించి, కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. ఖమ్మంలో వెంకటేష్ నిర్వహించిన రోడ్ షోకు పెద్ద ఎత్తున అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు.
భారీ మెజార్టీతో వియ్యంకుడిని గెలిపించాలని కోరుతున్న వెంకటేష్
వెంకటేష్ దారి పొడవున అభిమానులకు, ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రామ సహాయం రఘురాం రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వెంకటేష్ తో పాటు ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు ఇక నేడు రాత్రి 8 గంటలకు కొత్తగూడెం చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు విక్టరీ వెంకటేష్.
ప్రత్యర్థి పార్టీలపై ఎలాంటి విమర్శలు చేయని వెంకటేష్
కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి వచ్చిన వెంకటేష్ తమ వియ్యంకుడుని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం మినహా, ప్రత్యర్థి పార్టీలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆయన తీరును బట్టి, ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి కేవలం వియ్యంకుడి విజయం కోసమే ఆయన వచ్చినట్టు అర్ధం అవుతుంది.












Click it and Unblock the Notifications