హైదరాబాద్‌లో ఉంటున్నారా..? వెంటనే ఈ పరీక్ష చేయించుకోండి భయ్యా..!
హైదరాబాద్.. ప్రపంచంలోని మహా నగరాల్లో ప్రస్తుతం 41వ స్థానంలో ఉంది. మెట్రో పాలిటన్ సిటీగా అభివృద్ధి చెందింది. భాగ్యనగరంలో జనాభా రోజు రోజుకూ పెరిగిపోతోంది. 2025 లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా కోటీ 13 లక్షల 30 వేలుగా ఉంది. గతేడాదితో అంటే 2024 తో పోలిస్తే 2.43 శాతం పెరుగుదల కనిపించింది. అంటే ఏటా దాదాపు 3 శాతం జనాభా పెరిగిపోతోంది.
జనాభాతో పాటు వాహనాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని రకాల వాహనాల సంఖ్య చూస్తే 85 లక్షల 22 వేల 286 కు చేరింది. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ లో కలిపి ప్రస్తుతం 59 వేల 800 కంపెనీలు ఉన్నాయి.
ఈ క్రమంలో హైదరాబాద్ పరిస్థితి మరో దిల్లీగా మారబోతున్నట్లు సంకేతాలు బలంగా అందుతున్నాయి. నగరంలో రోజు రోజుకూ వాయు కాలుష్యం పెరిగిపోతుంది. మితి మీరిన కాలుష్యం నగరంలో విష ప్రవాహంలా అలుముకుంది. శ్వాస తీసుకుంటే.. ఆయువు మూడినట్టే.. అంతగా కాలుష్య కోరల్లో హైదరాబాద్ నగరం చిక్కుకున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
వాయు కాలుష్యం విజృంభించడానికి ప్రధానంగా వాహనాలు, పరిశ్రమలు, చెత్త కాల్చడం, నిర్మాణ రంగాల వ్యర్ధాలే కారణంగా పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక నగరంలో వాయు కాలుష్యం పెరుగుతున్న క్రమంలో ప్రజలు శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా అసహజ మరణాలకు ఐదో అతిపెద్ద కారణం వాయు కాలుష్యం ఉండటం గమనార్హం.
ముఖ్యంగా వాయు కాలుష్యంలో అత్యంత ప్రమాదకరమైనది బెంజిన్ వాయువు. డేంజర్ బెల్ మోగిస్తున్న ఈ బెంజిన్ వాయువు గాలిలో ఎంత శాతం ఉందో మానిటరింగ్ చేయలేదు. బెంజిన్ వాయువు క్యాన్సర్ కారకం అని తెలిసి ఇదివరకు పెట్రోల్ లో తీసివేశారు. డీజిల్ లోనూ తీసివేయాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది.
వీటితో పాటు పీఎం 10, పీఎం 2.5 ధూళికణాలు చిన్న సూక్ష్మ రేణువులుగా గాలిలో ఉంటాయి. ఈ వాయువు ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన తర్వాత ఎలర్జిక్ డిసీజెస్ ఆస్తమా, ఎలర్జిక్ రైనాయిటీస్ వంటి జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. అంతేకాక గాలిలో నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్.. వంటి ప్రమాదకర వాయువులను పీల్చడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ప్రజలు ఎప్పటికప్పుడు మాస్కులు ధరించాలని, బయటకు వెళ్లి వచ్చాక సబ్బుతో కాళ్లు, చేతులు, ముఖం కడుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications