హైదరాబాద్ లో బహుళ అంతస్తుల భవనాలకు పర్మిషన్ కావాలంటే ఆ పని తప్పనిసరి!
హైదరాబాద్ నగరం నీటి ఎద్దడితో అల్లాడుతుంది. కాంక్రీట్ జంగల్ లా హైదరాబాద్ నగరం మారడంతో నగర వాసులకు నీటి కష్టాలు వచ్చిపడ్డాయి. దీంతో హైదరాబాద్ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని జలమండలి కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మహానగరంలో కొత్తగా నిర్మించే అన్ని బహుళ అంతస్తుల భవనాలకు వర్షపు నీటిని హార్వెస్ట్ చేసే వ్యవస్థ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది
హైదరాబాద్ లో బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులపై ప్రకటన
హైదరాబాద్ మహానగరంలో కొత్తగా నిర్మించే అన్ని హైరైజ్ భవనాలు తప్పనిసరిగా వాటర్ హార్వెస్టింగ్ పిట్ లను ఏర్పాటు చేయాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేశారు. ఇకపై హార్వెస్టింగ్ సౌకర్యం లేని హైరైజ్ ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు మంజూరు చేయబోమని అధికారులు తెలిపారు. నగరంలో నీటి డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం చాలా ముఖ్యమైన నిర్ణయంగా కనిపిస్తుంది.

వర్షాలు పడకుంటే నీటి కొరత తప్పదు
ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.5 లక్షలకు పైగా నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వర్షాలు సకాలంలో పడకపోతే డిసెంబర్ నుంచి నీటి కొరత తప్పదని జలమండలి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ సంవత్సరం ఇప్పటికే వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. ముందు ముందు కూడా ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని అధికారులలో ఆశాభావం వ్యక్తం కావడం లేదు.
రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థల ఏర్పాటుకు నిర్ణయం
ఈ క్రమంలోనే భవిష్యత్తులోని పరిణామాలను దృష్టిలో పెట్టుకొని జలమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే భూగర్భ జలాలను సంరక్షించడం, వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్ తరాల అవసరాలను తీర్చాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం కొత్త భవనాలకు మాత్రమే కాకుండా, ఇప్పటికే ఉన్న భవనాల్లో కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను అమలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
నగరంలో నీటి సమస్యలకు చెక్ పెట్టే ప్లాన్
ఈ చర్య వల్ల నగరంలో నీటి సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, తమ ఇండ్లు, అపార్ట్‌మెంట్లలో హార్వెస్టింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని జలమండలి విజ్ఞప్తి చేసింది. ఈ నిర్ణయం తెలంగాణలో నీటి సంరక్షణ దిశగా ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతోంది.













Click it and Unblock the Notifications