షాకింగ్: బెడ్‌రూముల్లో సీక్రెట్ కెమెరాలు.. అద్దెదారుల్లో కలకలం
తమ బెడ్ రూమ్ లో సీక్రెట్ కెమెరాలు ఉండటం గుర్తించిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట పరిధిలో వెలుగుచూసిన ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ అపార్ట్ మెంట్ యజమాని అద్దెదారులకు తెలియకుండా వారి బెడ్ రూమ్స్ లో సీక్రెట్ కెమెరాలు అమర్చాడు. ఆపై వారు ఏకాంతంగా గడిపిన క్షణాలను వాటి ద్వారా రికార్డు చేసి వీక్షిస్తున్నాడు.
ఛత్రినాక పోలీసుల కథనం ప్రకారం.. జె.విజయానంద్(50)కు చాంద్రయాణగుట్టలో ఓ అపార్ట్ మెంట్ ఉంది. అదే అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న అతను.. వేరే పోర్షన్స్ ను ఇతరులకు అద్దెకు ఇచ్చాడు. ఈ క్రమంలో అదే అపార్ట్ మెంట్ లో అద్దెకు ఉంటున్న ఓ వ్యక్తి.. ఒకరోజు ఇంటి అద్దె చెల్లించేందుకు విజయానంద్ ఫ్లాట్ వద్దకు వెళ్లాడు.
ఆ సమయంలో తన కళ్లెదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి సదరు వ్యక్తి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. విజయానంద్ వీక్షిస్తున్న టీవిలో తన ఇంటికి సంబంధించిన దృశ్యాలు కనిపించాయి. విజయానంద్ నిర్వాకాన్ని గ్రహించిన సదరు వ్యక్తి వెంటనే ఇతర అద్దెదారులకు విషయం చేరవేశాడు.

ఆపై వారంతా అపార్ట్ మెంట్ లోని తమ ఫ్లాట్స్ లో వెతకగా సీక్రెట్ కెమెరాలు వారి కంటపడ్డాయి. తమ బెడ్ రూమ్ లో సీక్రెట్ కెమెరాలు ఉండటం గుర్తించిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహిత ఫిర్యాదు మేరకు విజయానంద్ ను పోలీసులు అరెస్టు చేశారు.
అతని వద్ద నుంచి కంప్యూటర్ మానిటర్, సీపీయూ,హార్ట్ డిస్క్, టీవీ ట్యూనర్, మూడు సీక్రెట్ స్పై కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గత రెండు నెలల నుంచి ఇదే పనిలో ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. అద్దెదారుల ఇళ్లలోని బెడ్ రూమ్ దృశ్యాలను రికార్డు చేస్తూ.. ఆపై వాటిని వీక్షిస్తూ కాలక్షేపం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అయితే ఈ వీడియోలను అతను ఇంకెవరికైనా చేరవేస్తున్నాడా? అన్న కోణంలో ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తాజుద్దీన్ అహ్మద్ మీడియాకు వివరించారు. అతనిపై ఐపీసీ సెక్షన్354-c కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications