హైదరాబాద్ మెట్రోలో పనిచేయని సెన్సార్లు.. ప్రయాణికులు ఆగమాగం .. కొత్త డిమాండ్!
హైదరాబాద్ మెట్రో నిత్యం వేలాది మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరుస్తూ సేవలు అందిస్తోంది. హైదరాబాద్ లో పని చేసే ఐటీ ఉద్యోగులకు సమయానికి ఆఫీసులకు చేర్చే పుష్పక వాహనంలా పని చేస్తుంది. నగర ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుని ప్రయాణాలు చెయ్యలేని ఎందరికో హైదరాబాద్ మెట్రో సుఖవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది. అటువంటి హైదరాబాద్ మెట్రోసేవలు నిలిచిపోతే నిత్యం ప్రయాణాలు చేసేవారు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు.
మెట్రో రైలు సేవల్లో ఉదయం సాంకేతిక అంతరాయం
హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో శనివారం ఉదయం సాంకేతిక అంతరాయం ఏర్పడింది. మెట్రో స్టేషన్లలోని ఆటోమేటిక్ గేట్ల సెన్సార్లు పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసినవారు స్టేషన్లలోకి ప్రవేశించలేకపోగా, మెట్రో దిగినవారు బయటకు రాలేక చిక్కుకుపోయారు. ఉదయం ఆఫీసులు, స్కూళ్లు, విద్యాసంస్థలకు వెళ్లే రద్దీ సమయంలోనే ఈ సమస్య తలెత్తడంతో పలు స్టేషన్ల వద్ద పెద్ద ఎత్తున క్యూలు కట్టారు ప్రయాణికులు.

పనిచేయని టికెట్లను స్కాన్ చేసే సెన్సార్లు.. ప్రయాణికుల గందరగోళం
టికెట్లను స్కాన్ చేసే సెన్సార్లు పనిచేయకపోవడంతో ఇన్‌గేట్‌లు, ఔట్‌గేట్‌లు రెండింటి వద్దనూ ప్రయాణికులు నిలిచిపోయారు. గందరగోళ పరిస్థితి నెలకొని ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.స్టేషన్ సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించలేకపోవడంతో ప్రయాణికుల్లో అసంతృప్తి మరింత పెరిగింది.
రద్దీ సమయాల్లో ఆన్‌లైన్ టికెటింగ్, స్కానింగ్, ఆటోమేటిక్ గేట్ల వ్యవస్థలు
మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్, స్కానింగ్ సేవల్లో తరచూ ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టికెట్లు కొన్న తర్వాత కూడా గేట్ల వద్ద ఎక్కువసేపు వేచి ఉండాల్సి రావడం వల్ల ప్రయాణ సమయం వృథా అవుతోందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ సమయాల్లో ఆన్‌లైన్ టికెటింగ్, స్కానింగ్, ఆటోమేటిక్ గేట్ల వ్యవస్థలు నిరంతరాయంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రజారవాణా వ్యవస్థలో ఇలాంటి అంతరాయాలు ఏర్పడకుండా ముందస్తు చర్యలకు డిమాండ్
అయితే శనివారం ఉదయం ఏర్పడిన ఈ సాంకేతిక సమస్యకు కచ్చితమైన కారణం, ఎన్ని స్టేషన్లలో ప్రభావం పడింది, సమస్య ఎప్పటిలోగా పూర్తిగా పరిష్కారమైంది అనే వివరాలు అధికారికంగా మెట్రో ఇంకా వెల్లడించాల్సి ఉంది. మెట్రో వంటి ప్రజారవాణా వ్యవస్థలో ఇలాంటి అంతరాయాలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు అవసరమని ప్రయాణికులు కోరుతున్నారు. సాంకేతిక ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, ఒకవేళ వచ్చినా వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చెయ్యాలని వారు కోరుతున్నారు.













Click it and Unblock the Notifications