Hyderabad: నిమ్స్‌లో ఉచితంగా పిల్లలకు గుండె ఆపరేషన్లు, ఈ తేదీల్లోనే
హైదరాబాద్: హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల తల్లిదండ్రులకు శుభవార్త. చిన్నారులకు చికిత్స అందించేందుకు రూ. లక్షలు ఖర్చు పెట్టలేని తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ పిల్లలను కాపాడుకోవచ్చు. హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు గుండె ఆపరేషన్లను ఉచితంగా చేయనున్నారు.
ఇందుకోసం బ్రిటన్ వైద్యులు, నిలోఫర్, నిమ్స్.. ఓ బృందంగా ఏర్పడినట్లు ఆదివారం ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప ఓ ప్రకటనలో వెల్లడించారు. 'చార్లెస్ హార్ట్ హీరోస్ క్యాంపు' పేరుతో బ్రిటన్ పీడియాట్రిక్ వైద్యులు డాక్టర్ దన్నపునేని రమణ ఆధ్వర్యంలో పది మంది వైద్యులు నిమ్స్ ఆస్పత్రికి రానున్నారు.

అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి ఐదేళ్ల వయసు వారికి పుట్టుకతో, జన్యుపరంగా వచ్చే గుండె సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపనున్నారు. పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ , సీఎం సహాయ నిధితో నిర్వహించనున్నారు. గత సంవత్సరం కూడా వారంపాటు చికిత్సలు నిర్వహించి 9 మంది చిన్నారులకు ప్రాణం పోశారు.
నెలన్నర వయస్సున్న ఓ చిన్నారికి తొలిసారిగా ఎక్మో యంత్రంతో వైద్యం అందించి కాపాడారు. తాజాగా, ఆస్పత్రి కార్డియో థొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్వరరావు నేతృత్వంలో రోజూ 2-3 ఆపరేషన్లు చేయనున్నారు. ఇతర వివరాల కోసం 040-23489025 ఫోన్ నెంబర్‌కు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోపు సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల తల్లిదండ్రులు ఉపయోగించుకుని తమ పిల్లలను కాపాడుకోవచ్చు.












Click it and Unblock the Notifications