"హైడ్రా" తో లబోదిబో - ఖజానాకు నష్టం ఎంత..!!
హైడ్రా. ఇప్పుడు తెలంగాణలో ఈ పేరు సంచలనంగా మారింది. హైదరాబాద్ రియల్టర్లను వణికిస్తోంది. అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోంది. ఇదే సమయంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పైన పెను ప్రభావం చూపుతోంది. స్థలాలు - ఇళ్ల కొనుగోళ్లు, అమ్మకాలు తగ్గిపోయాయి. ఫలితంగా రిజిష్ట్రేషన్లు పడిపోయాయి. దీంతో..ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. మరి.. ప్రభుత్వం ఏం చేయబోతోంది.
హైడ్రా ప్రభావం
ఆర్దికంగా తెలంగాణ ప్రభుత్వం ముందు పలు సవాళ్లు ఉన్నాయి. ఆర్దిక కష్టాలను ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో రాష్ట్ర ఖజానాకు నిధులు తెచ్చిపెట్టే హైదరాబాద్ రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. ప్రభుత్వం హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణల నిర్మూలనకు తీసుకొచ్చిన హైడ్రా భారీ ప్రభావం చూపుతోంది. హైడ్రా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ను షేక్ చేస్తోంది. రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిపోయి.. ఆదాయం పడిపోయింది. జూలైతో పోల్చితే ఆగస్టులో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ఆదాయం రూ.412 కోట్లు తగ్గింది.

పడిపోయిన కొనుగోళ్లు
హైదరాబాద్ లో భూములు, ఇండ్ల కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి. హైదరాబాద్‌తోపాటు శివారు జిల్లాల్లో కలిపి ఏకంగా 330 కోట్ల రాబడి తగ్గింది. అంటే రాష్ట్రవ్యాప్త నష్టంలో 80 శాతం ఇక్కడే నమోదైంది. హైడ్రా దూకుడుతో రియల్ వ్యాపారులు టెన్షన్ పడుతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం జూలై నెలలో రాష్ట్రవ్యాప్తంగా 1,33,408 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యా యి. దీంతో ఖజానాకు రూ.1318.81 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి రూ.509 కోట్ల రాబడి నమోదైంది.
తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
ఇక, ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్ల సంఖ్య, రాబడి గణనీయంగా పడిపోయింది. గత నెలలో కేవలం 89,585 డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా, రూ.906.57 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. 43,823 రిజిస్ట్రేషన్లు తగ్గాయి. జూలైతో పోల్చితే 32 శాతం పడిపోయాయి. ఆదాయం రూ.412.24 కోట్లు అంటే.. జూలైతో పోల్చితే 31 శాతం తగ్గిపోయినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రధాన ఆదాయ వనరు గ్రేటర్ జిల్లాలే. ఈ జిల్లాల నుంచే 80 శాతం ఆదాయం వస్తుంటుంది. రిజిస్ట్రేషన్ల సంఖ్య దాదాపు 20 వేలు పడిపోగా.. రూ.330 కోట్ల రాబడి తగ్గింది. నష్టపోయిన ఆదాయం భర్తీకి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications