నీ ప్రైవేట్ వీడియోలు అప్‌లోడ్ చేస్తా! ఎమ్మెల్యేకు యూట్యూబర్ బెదిరింపులు
హైదరాబాద్: మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులనే గాక, ప్రజాప్రతినిధులను కూడా బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావును బెదిరిస్తూ 5 కోట్లు డిమాండ్ చేసిన ఓ యూట్యూబర్‌ను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేారు. తన నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ఓ మహిళతో కలిసి సదరు యూట్యూబర్ బెదిరిస్తున్నాడుని ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులపై ఏప్రిల్ 22న కేసు నమోదు చేశారు.
గురువారం నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. వారి నుంచి ల్యాప్‌టాప్, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచర్ల మండలానికి చెందిన మేనం శ్యామ్ సుందర్.. సంగారెడ్డి జిల్లా బీహెచ్‌ఈఎల్‌లో ఉంటున్నాడు. యూట్యూబర్‌గా కొనసాగుతున్న అతడు.. ఏప్రిల్ 15న ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుకు ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ కావాలని అడిగాడు.

అదేరోజు రాత్రి 7.30 గంటలకు హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కొందరితో కలిసి శ్యామ్‌సుందర్.. లక్ష్మీకాంతరావు కలిశారు. 'నా వద్ద ఓ మహిళ ఇచ్చిన సమాచారం ఉంది. అది బహిర్గతమైతే మీ రాజకీయ జీవితంతో పాటు వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతింటుంది' అని ఎమ్మెల్యేతో చెప్పాడు. అది బయట పెట్టకుండా, సోషల్ మీడియాలో పెట్టకుండా ఉండాలంటే తనకు రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే, వీటికి లక్ష్మీకాంతరావు తలొగ్గలేదు.
తాను ఎలాంటి తప్పు చేయలేదని, డబ్బు ఇచ్చేది లేదని అక్కడి నుంచి వెళ్లిపోవాలని శ్యామ్ సుందర్‌కు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఏప్రిల్ 21న శ్యామ్‌సుందర్.. ఎమ్మెల్యే అనుచరుడు నరేశ్ నాయుడు వాట్సప్‌కు నకిలీ, కల్పిత కంటెంట్ ఉన్న స్క్రీన్‌షాట్లను పంపించాడు. అవి ఎమ్మెల్యేకు షేర్ చేయాలని చెప్పాడు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పోలీసును ఆశ్రయించారు. తన నుంచి డబ్బు వసూలు చేసేందుకు నేరపూరిత ఉద్దేశంతో తరచూ బ్లాక్‌మెయిల్ చేయడంతో తనకు మానసిక ఒత్తిడితో పాటు తన కుటుంబ భద్రతపై ఆందోళన కలిగించాయని ఎమ్మెల్యే తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఓ మహిళతో కలిసి శ్యామ్ సుందర్ ఇదంతా చేస్తున్నట్లు అర్థమైందని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. అయితే న్యాయమూర్తి మాత్రం నిందితుల రిమాండ్ తిరస్కరించారు. నోటీసులు ఇచ్చి పంపాలని పోలీసులకు సూచించారు.












Click it and Unblock the Notifications