బయటకు రావద్దు, అతి భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తీవ్ర హెచ్చరిక..!!
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మరో ఐదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆగస్ట్ 13న మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఆగస్ట్ 13,14 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు (మంగళవారం) భారీ వర్షం కురిసే వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్‌తో పాటు జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, మిగతా అన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది. కాగా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది.

దీంతో, పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్న క్రమంలో ప్రభుత్వ యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలు కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని తెలిపింది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, హైడ్రా, మాన్సూన్, డీఆర్‌డీఎఫ్, పోలీస్ సిబ్బందికి ముందస్తు హెచ్చరికలు జారీచేసినట్టు వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. ఇటు.. జంట నగరాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. వరుస వానలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం రోజులుగా భారీ వర్షాలు నగరాన్ని గజగజలాడిస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం మళ్లీ జంట నగరాలు తడిసిముద్దయ్యాయి.
ఇక, రాగల 24గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ రోజు రాత్రి 11 గంటల వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, సాయంత్రం వేళల్లో నగర వాసులు అప్రమత్తగా ఉండాలి, వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.












Click it and Unblock the Notifications