భానుడి భగభగల వేళ బిగ్ రిలీఫ్, 4 రోజులు ఇక వర్షాలే - ఈ జిల్లాలకు తాజా అలర్ట్..!!
భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. చాలా చోట్ల 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా... జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో... వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో రాగల 4 రోజుల పాటు పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో భానుడు తీవ్రరూపం దాల్చుతున్నాడు. రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 45 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడితో పాటు వడగాల్పులు, ఉక్కబోతతో జనాలు భయపడిపోతున్నారు. రానున్న కొద్ది రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతవారణశాఖ హెచ్చరిస్తోంది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, అల్లూరి సీతారామారాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 301 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇక 55 మండలాల్లో సాధారణ వడగాలులు ఉంటాయని తెలిపింది. ఇక పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, రాయలసీమ, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తాజాగా అధికారులు హెచ్చరించారు.

వాతావరణ శాఖ తాజా అంచనాలు
ఇదే సమయంలో తెలంగాణ జిల్లాలకు వర్షాల పైన అలర్ట్స్ జారీ అయ్యాయి. దక్షిణ తెలంగాణ లోని జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఇవాళ ఉదయం 8 గంటలలోపు జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరు పులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న ఆరు రోజుల పాటు అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్య వడగాల్పులు వీస్తాయని, బయటకు రావొద్దని సూచించింది. 19వ తేదీన ఖమ్మం, మెదక్, జగిత్యాల, ములుగు, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు పడనుండగా.. 20న నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వానలు పడతాయని అంచనా వేసింది.












Click it and Unblock the Notifications