కవితకు చెక్ పెట్టటంతో పాటు.. ఆ ప్లాన్ తో ప్రజాక్షేత్రంలోకి కేటీఆర్!
రాష్ట్రంలో కవిత ఎపిసోడ్ తో బి ఆర్ ఎస్ పార్టీ మరింత దారుణంగా తయారయింది. ఈ సమయంలో బిఆర్ఎస్ పార్టీకి జవసత్వాలు నింపడంతో పాటు, కవితకు చెక్ పెట్టడానికి, ప్రత్యర్థి పార్టీలకు సైతం వెన్నులో వణుకు పుట్టించడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో గత వారం రోజులుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ అధినేత కెసిఆర్ తో కేటీఆర్ మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది.
రంగంలోకి కేటీఆర్
ప్రస్తుత పరిస్థితులలో పార్టీని బలోపేతం చేయడం పైన దృష్టి సారించాలని కేసీఆర్ కేటీఆర్ కు సూచించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలలోనూ పర్యటనలు చేయాలని రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ నుండి కవితను బహిష్కరించిన తర్వాత పార్టీలో చోటు చేసుకున్న సంక్షోభాన్ని తొలగించడానికి, పార్టీ క్యాడర్లో నెలకొన్న గందరగోళాన్ని తగ్గించడానికి కేటీఆర్ రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం.

ప్రజా క్షేత్రంలోకి కేటీఆర్.. మతలబు ఇదే
ముఖ్యంగా పార్టీ నుండి వీడిపోయిన ఎమ్మెల్యేలను, వారి నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకొని కేటీఆర్ రంగంలోకి దిగి క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తలను, ప్రజలను కలవబోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలలో పట్టు నిలుపుకోవడానికి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో విజయం సాధించడానికి, ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీలకు, కవితకు చెక్ పెట్టడానికి కేటీఆర్ ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.
కేటీఆర్ టూర్ ఖరారు.. ఈ నియోజకవర్గాల్లో పర్యటన
ఈ క్రమంలోనే ఈనెల 10వ తేదీన కొత్తగూడెం, 11వ తేదీన భద్రాచలం నియోజకవర్గాలలో కేటీఆర్ పర్యటించనున్నారు. అనంతరం సెప్టెంబర్ 13వ తేదీన గద్వాల్ నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించి, ఆపై బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక దసరా పండుగ లోపు వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాలలో పర్యటించాలని పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహాన్ని నింపాలని భావిస్తున్నారు.
ప్రజల నుండి కేటీఆర్ కు స్పందన వస్తుందా?
వచ్చే ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేయాలని కేటీఆర్ భావిస్తున్నారు. ప్రజాక్షేత్రంలోకి వచ్చి పర్యటనలు చేయనున్న కేటీఆర్ పార్టీ శ్రేణులను ఏ విధంగా బలోపేతం చేస్తారు అనేది ముందు ముందు తెలియనుంది. ప్రజల నుండి కేటీఆర్ పర్యటనకు ఏ మేరకు స్పందన వస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications