గేమ్ మార్చేసిన హై"కమాండ్" - సీఎం ఖరారు, నేడే ప్రమాణ స్వీకారం..!!
తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు. ఈ రోజునే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందా. ఇప్పుడు ఈ చర్చ తెలంగాణ వ్యాప్తంగా మొదలైంది. అటు సీఎల్పీ నేతను ఎన్నుకొనేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశంలో హైకమాండ్ కు బాధ్యత అప్పగిస్తూ తీర్మానం చేసారు. ఇటు సీనియర్లు తమకు సీఎంగా అవకాశం ఇవ్వాలంటూ మంత్రాంగం ప్రారంభించారు. దీంతో, హైకమాండ్ అలర్ట్ అయింది. వేగంగా అడుగులు వేస్తోంది. ఈ రోజునే ఈ వ్యవహారినికి స్పష్టత ఇవ్వాలని భావిస్తోంది.
హైకమాండ్ కు అప్పగింత
తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహారం ఈ రోజునే తేల్చాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం ఎంపిక అధికారం పార్టీ హైకమాండ్ కు అప్పగిస్తూ ఏకవ్యాఖ్య తీర్మానం పంపారు. రేవంత్ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే, ఆకస్మికంగా సీనియర్లు మంత్రాంగం ప్రారంభించారు.

సీఎం అభ్యర్దిని ఖరారు చేసే ముందు పార్టీ కోసం కష్ట నష్టాలు భరించి పని చేసిన సీనియర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో డీకే శివకుమార్ వారికి సీఎల్పీ సమావేశం ముందే పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ ఆమోదించాల్సిందేనని..కర్ణాటకలో జరిగిన పరిణామాలను గుర్తు చేసినట్లు సమాచారం.
సీఎంగా రేవంత్..భట్టికి డిప్యూటీ
ఈ మధ్నాహ్నమే సీఎం అభ్యర్దిని పార్టీ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సీనియర్ల ఆలోచనల్లో వస్తున్న మార్పులు..అటు మెజాట్టి కంటే నాలుగు సీట్లు మాత్రమే ఎక్కువగా ఉండటంతో హైకమాండ్ అలర్ట్ అయింది. దీంతో..ఈ రోజునే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలని..డిసెంబర్ 9న మంత్రివర్గ విస్తరణ..బహిరంగసభ కు ప్లాన్ చేయాలని సూచిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

రేవంత్ ను సీఎంగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఢిల్లీ సమాచారం. కర్ణాటక తరహాలో సీఎంగా రేవంత్, పీసీసీ చీఫ్ పదవితో పాటుగా డిప్యూటీ సీఎంగా భట్టి..అదే విధంగా ఎస్టీ, మైనార్టీ వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని సూచన చేసినట్లు విశ్వసనీయ సమాచారం. సీనియర్లక తగిన గుర్తింపు ఇచ్చేలా కీలక శాఖలు ఉంటాయని..పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇవ్వనున్నారు.
నేడే ప్రమాణ స్వీకారం..!
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ పేరు ప్రకటన లాంఛనంగా కనిపిస్తోంది. ఈ సాయంత్రం సీఎంగా రేవంత్..డిప్యూటీ సీఎంగా భట్టి రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మేరకు అటు రాజ్ భవన్ లోనూ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరింత ఆలస్యం చేయటం ద్వారా సొంత పార్టీలోనూ..రాజకీయంగానూ మూడ్ మారే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో.. ఈ రోజునే సీఎం ప్రమాణ స్వీకారం పూర్తి చేసేలా దాదాపు నిర్ణయం జరిగింది. కాంగ్రెస్ ముఖ్య నేతల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సాయంత్రం తెలంగాణ నూతన సీఎంగా రేవంత్..డిప్యూటీగా భట్టి ప్రమాణ స్వీకారం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications