మహిళలకు మరో సూపర్ న్యూస్..మీ కోసం ఆ భవనాలు..ప్రారంభం అప్పుడే!
తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఆర్ధిక స్వావలంబన కోసం రాష్ట్రప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణా ప్రభుత్వం ఈ దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే మహిళా సంఘాల మహిళలను వ్యాపారవేత్తలుగా, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే పనిలో ఉంది. ఇదే క్రమంలో తాజాగా 22జిల్లాల్లో మహిళా సమాఖ్యల కోసం ఇందిరా మహిళా శక్తి భవనాలను సిద్ధం చేసింది.
రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరా మహిళా శక్తి భవనాల ప్రారంభం
వచ్చే నెల మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ భవనాలను ప్రారంభించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు సన్నాహాలు చేస్తున్నాయి.మహిళా స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలకు జిల్లా స్థాయిలో శాశ్వత మౌలిక వసతులు కల్పించడం ఈ భవనాల ముఖ్య ఉద్దేశం. శిక్షణ, సమావేశాలు, వ్యాపారాభివృద్ధి, ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్ వంటి కార్యక్రమాలను ఒకే వేదికపై నిర్వహించేందుకు వీలుగా వీటిని రూపొందించారు.

22 భవనాలకు రూ.110 కోట్లు ఖర్చు
ఒక్కో భవనానికి రూ.5 కోట్లు చొప్పున మొత్తం 22 భవనాలకు రూ.110 కోట్లు ఖర్చు చేశారు. ప్రతి భవనం సుమారు 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన సదుపాయాలతో నిర్మించారు. అధికారుల ప్రకారం ఇప్పటికే 12 భవనాల నిర్మాణం పూర్తయింది. మరో 8 భవనాలు ఈ నెలాఖరు వరకు పూర్తవుతాయి. మిగిలిన రెండు చివరి దశలో ఉన్నాయి.
సెప్టెంబరు మొదటి వారంలో ప్రారంభానికి ఏర్పాట్లు
శుక్రవారం మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి ఈ నిర్మాణాలపై నివేదిక సమర్పించారు. జిల్లా స్థాయిలో నిర్మిస్తున్న ఈ భవనాలు మహిళా సంఘాలకు శాశ్వత చిరునామాగా మారడంతో పాటు మహిళా సాధికారతకు కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని తెలిపారు. సెప్టెంబరు మొదటి వారంలో ప్రారంభోత్సవానికి రావాలని సీఎంను ఆహ్వానించగా ఆయన అంగీకరించారు.
స్వయం సహాయక సంఘాల కార్యాకలాపాల కోసం ఇందిరా మహిళా శక్తి భవనాలు
ఈ భవనాలు మహిళా సమాఖ్యల కార్యకలాపాలను మరింత బలోపేతం చేసి, గ్రామీణ మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదం చేయనున్నాయి.మొత్తంగా మహిళల ఆర్ధిక ప్రగతికి మాత్రమే కాదు స్వయం సహాయక సంఘాల కార్యాకలాపాల కోసం కూడా ఇందిరా మహిళా శక్తి భవనాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం అన్ని విధాలా వారికి అండదండలు అందిస్తుంది.












Click it and Unblock the Notifications