నివురుగప్పిన నిప్పులా కాంగ్రెస్.. సీఎం రేవంత్ రెడ్డికి టెన్షన్!!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి కొత్త తలనొప్పి వచ్చి పడిందా? బిఆర్ఎస్ పార్టీ నుండి వలసలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలకు కారణం అవుతున్నాయా? రేవంత్ పార్టీలో కోటరీని తయారు చేస్తున్నారా? రేవంత్ రెడ్డి పై పార్టీ శ్రేణులు అసహనం పెరుగుతుందా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.
కాంగ్రెస్ లోకి వలసల బాట
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు పెరిగిపోతున్నాయి. ఏ జిల్లాలో చూసినా వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. పాత కొత్త నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. నియోజకవర్గాలలో ఆధిపత్యం కోసం నువ్వా నేనా అన్నట్టు వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఊహించని విధంగా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలోను, పార్లమెంటు ఎన్నికలలో ఓటమిపాలు కావడంతో బీఆర్ఎస్ నుండి నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వలస బాట పట్టారు.

చేరికలతో మెజార్టీ జిల్లాల్లో అసహనం
తెలంగాణ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఇక తాజాగా చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా బిఆర్ఎస్ నుండి వరుసగా ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్ బాట పట్టడంతో కాంగ్రెస్ లో అప్పటికే ఉన్న నేతల్లో అసహనం పెల్లుబుకుతుంది.
మంత్రుల్లోనూ రెండు వర్గాలు?
కొత్తగా వచ్చి చేరిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. రాష్ట్రవ్యాప్తంగా నివురుగప్పిన నిప్పులా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు కొనసాగుతున్నాయి. ఇక మరోవైపు పార్టీలో మంత్రులు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు అన్న చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి వర్గం ఒకవైపు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ మంత్రుల వర్గం మరోవైపు అన్నట్టు పార్టీ వ్యవహారం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
నివురుగప్పిన నిప్పులా కాంగ్రెస్
రేవంత్ రెడ్డి గతంలో తనతో కలిసి టీడీపీలో పని చేసిన సహచరులను కాంగ్రెస్ లో చేర్చుకోవటంతో పార్టీ నేతల్లో అసహనం వ్యక్తం అవుతుంది. ఇక ఈ పరిణామాలన్నీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారాయని టాక్ వినిపిస్తుంది. ఇక త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణ లో ఎవరికి స్థానం దక్కుతుంది అన్నది కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉబుకుతున్న అగ్నిపర్వతం బద్దలయ్యే రోజు త్వరలోనే ఉంటుందని పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications