శంకర్ బొమ్మ : తేరిపార చూసిన చిరంజీవి.. కేసీఆర్ ఏమనుంటారు! (ఫొటోలు)

శంకర్ మాట కూడా మ్యాజికల్ ఫీలింగే :
'శంకర్..' బొమ్మల్ని ఫ్రేమ్ చేసి మెస్మరైజ్ చేయగలడు. బొమ్మలేనా! వాటెనుక మాటలూ మ్యాజికల్ ఫీలింగే. అయితే వీటిని ప్రత్యేకించి ఫ్రేమ్ చేయాల్సిన అవసరం లేదు. శంకర్ మాట అలాంటిది. ఇట్స్ నాట్ ఏ పాలిష్డ్ సెంటెన్స్. కీర్తి కండూతి లాంటి ప్రస్తావనలకు అంతగా ప్రాధాన్యమిచ్చే వ్యక్తి కాదు శంకర్. మాట్లాడేది ఏ స్థాయి వ్యక్తి అయినా సరే.. అదే నవ్వు ముఖం.. అదే మాట తీరు.
'మనిషి వీలైనంత డౌన్ టూ ఎర్త్ ఉండాల్నే.. నేన్ దాన్నేనమ్ముత!'.. పేరాగ్రాఫ్ లు పేర్చుకుంటూ పోవడం కన్నా ఈ ఒక్క మాట చాలు. ఆయన వ్యక్తిత్వమేంటో చెప్పడానికి. దటీజ్ శంకర్..
- టీ పే చర్చ లాగా.. పొద్దున్నే శంకర్ తో ఓ ఛాయ్ మీటింగ్ అయింది. అయితే.. మాట్లాడేప్పుడు ఆయన్ను ఒక్క పాయింట్ దగ్గర దొరకబట్టుకోవడం చాలా కష్టం. ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్.. అక్కడి నుంచి మరొకటి.. ఇలా ఆయన మాటల్లో పడి అసలు టాపిక్ ను మరిచిపోయి ఆయనతో పాటు ట్రావెల్ అవుతాం. అలా మనల్ని ఎక్కడికో తీసుకెళ్లి వదిలిపెట్టాక.. ఎక్కడో మొదలయ్యామే అంటూ ఆగిపోతాం. అక్కడే శంకర్ ను పట్టుకోవాలి.. లేదంటే మళ్లీ మనల్ని ఏ బ్రెజిల్ ఆర్టిస్ట్ దగ్గరకో.. ఆర్కే లక్ష్మణ్ దగ్గరకో తీసుకెళ్లి కూర్చోబెట్టేస్తాడు.
చిరంజీవి కేసీఆర్ గురించి శంకర్ ఏం చెప్పారు! :

చిరంజీవి దగ్గరికెళ్లినప్పుడు :
'2005లో మొదటిసారి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసిన. చీఫ్ గెస్ట్ ఎవరో ఒకరు ఉండాలే కదా.. నాకు చిరంజీవిని తీసుకురావాలని ఉండే. మా అమ్మ (రాజ్యం) కూడా చిరంజీవి సినిమాలంటే బాగా ఇష్టపడుతది. సరే.. మొత్తానికి ఓరోజు చిరంజీవి షూటింగ్ స్పాట్ కు వెళ్లిన. సినిమా ప్రపంచం కొంచెం కొత్తగనే ఉంది.
ఓ బాయ్ వెళ్లి.. చిరంజీవికి విషయం చెప్పిండు. దూరం నుంచి నన్ను చూసిన చిరంజీవి చెయ్యితోనే 'వచ్చేయండి..' అంటూ సైగ. దగ్గరకెళ్లిన తర్వాత మంచిగ మాట్లాడిండు. కుర్చీ వేసి కూర్చోబెట్టి.. నా బొమ్మలన్ని చూసి చాలా బాగున్నాయి అన్నడు. అయితే చీఫ్ గెస్ట్ మాటెత్తేసరికి.. నేనెప్పుడు బయట ఇలాంటి ప్రోగ్రామ్స్ రాలేదు శంకర్ గారు, రావడం కుదరదు. అంతకుముందొకసారి చిరంజీవి ఇంట్లో కలిసినప్పుడు కూడా ఇదే మాట చెప్పారాయన. నేనెమన్నా అంటే.. మీరొస్తేనే ఎగ్జిబిషన్ చేస్తా లేదంటే చేయను..' వచ్చేసిన ఇక అక్కడినుంచి..
సరిగా గుర్తు లేదు గానీ, ఆ తర్వాత రెండు మూడు రోజులకు చిరంజీవి అసిస్టెంట్ నుంచి ఫోన్ కాల్. ఎగ్జిబిషన్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు..?
... ... ...

ఆ బొమ్మ దగ్గరే చిరంజీవి ఎందుకు ఆగిపోయారు?
మొత్తానికి చిరంజీవి ఎగ్జిబిషన్ కు వచ్చారు. భలే ఉన్నాయ్ శంకర్.. అంటూ ఒక్కో బొమ్మను చూస్తూ పోతున్నారు. అలా.. కేసీఆర్ బొమ్మ వద్దకు వచ్చి అక్కడే ఆగిపోయారు. (కేసీఆర్ తలలో తెలంగాణ ముఖచిత్రం కనిపించేలా గీసిన బొమ్మ అది). అడిగారు.. ఎందుకిలా వేశారని? ఒక్కటే చెప్పిన.. తల తాకట్టు పెట్టయినా సరే తెలంగాణ తెస్తా అన్నడు కదా సార్ కేసీఆర్.. అందుకే అట్లా..
-ఆ తర్వాత యాథృచ్చికంగా.. చిరంజీవి కేసీఆర్ బొమ్మ దగ్గరే ఆగిపోయి పరిశీలనగా చూస్తోన్న దృశ్యం.. మీడియాలో కేసీఆర్ సార్ చూసిండట. శేఖర్ రెడ్డి నుంచి ఫోన్ కాల్ వచ్చింది.. వెంటనే ఆ బొమ్మ తీసుకుని క్యాంప్ ఆఫీస్ కు రావాలని కేసీఆర్ చెప్పారట. ఉరుకులు పరుగుల మీద మొత్తానికి ఆ బొమ్మ తీసుకుని కేసీఆర్ ఇంటికి వెళ్లిన.

కేసీఆర్ తో లంచ్ లో చిరంజీవి టాపిక్ :
'లంచ్ మీటింగ్.. కేసీఆర్ పక్కన్నే కూర్చున్న. ముందువైపు శేఖర్ రెడ్డి. ముగ్గురమే. కేసీఆర్ సార్ అడిగిండు.. చిరంజీవి ఎందుకట్లా నా బొమ్మ దగ్గర్నే ఆగిపోయిండని?. తెలంగాణ బొమ్మ కేసీఆర్ తలలోనే ఎందుకు గీశావని అడిగారు.. నా సమాధానం. మీరేం చెప్పారు? తల తాకట్టు పెట్టయినా తెలంగాణ తెస్తా అన్నారు కదా సార్ అందుకే అట్లా గీసిన అని చెప్పిన.

శంకర్ ను అభినందించిన కేసీఆర్..
శెభాష్ అన్న తరహాలో కేసీఆర్ నన్ను గర్వంగా చూశారు. గంటకు పైగానే నాతో పాటు సరదాగా ముచ్చటించారు. అంతర్జాతీయ అవార్డు వచ్చినప్పుడు నేను కలిస్తే శంకర్ నీవు వేసిన మండేలా బొమ్మ నా దగ్గర ఉండాల్సిందే.. ఇట్లా చిన్న సైజు కాదు, పెద్ద సైజు చేసి పంపించగలవా అంటూ కేసీఆర్ అడిగారు. వచ్చేటప్పుడు ఓ చిన్న బహుమతి ( సీక్రెట్ అది).

కేసీఆర్, చిరంజీవి వద్ద శంకర్ బొమ్మలు
'ఇప్పుడా బొమ్మ కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలోనే ఉన్నట్లుంది. ఇక చిరంజీవి ఇంటి హాల్ లోను నేను గీసిన మథర్ థెరిస్సా బొమ్మ ఇప్పటికీ ఉండే ఉంటది.'
శంకర్ వేసిన ప్రతీ బొమ్మ వెనుక.. శంకర్ ఇచ్చే వివరణ చాలా గొప్పగా ఉంటుంది. అలాంటి కొన్నింటినయినా రికార్డు చేయడం గ్రేట్ ఫీల్. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ఆయన ఇంటర్వ్యూలో ఫుల్ సినిమా.. త్వరలో వన్ ఇండియా.కామ్ లో












Click it and Unblock the Notifications