తెలంగాణా గర్వం.. కాకతీయ రీజియన్ టెంపుల్ టూర్, ప్రత్యేకతలివే!
తెలంగాణ రాష్ట్రం సాంస్కృతిక వైభవానికి, పురాతన శిల్పకళలకు, ప్రకృతి సౌందర్యానికి ఆలవాలమైన రాష్ట్రం. అటువంటి తెలంగాణలో టూరిజం శాఖ అందిస్తున్న అద్భుతమైన ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజ్ కాకతీయ రీజియన్ టెంపుల్ టూర్ ప్యాకేజ్. కాకతీయుల రాజధాని వరంగల్ కేంద్రంగా పర్యాటక శాఖ అందిస్తున్న ఈ టూర్ ప్యాకేజ్ గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.
పర్యాటక అనుభూతిని, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందే టూర్ ప్యాకేజ్
తెలంగాణ పర్యాటక శాఖ రూపొందించిన ముఖ్యమైన ప్యాకేజీలలో ఇది ఒకటి. వరంగల్, హన్మకొండ, ములుగు, లక్నవరం, భూపాలపల్లి, పరకాల ప్రాంతాలలో ఉన్న చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శిస్తూ పర్యాటక అనుభూతిని, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందేలా రూపొందించిన టూర్ ప్యాకేజీ ఇది. అనేక ముఖ్యమైన టెంపుల్ సర్క్యూట్ లను, కాకతీయుల శిల్పకళకు నిదర్శనంగా నిలిచిన కట్టడాలను చూపిస్తూ సాగుతుంది.

ఈ ఆలయాలు, చారిత్రక ప్రాంతాల సందర్శన
వేయిస్తంభాల దేవాలయం, భద్రకాళి దేవస్థానం, వరంగల్ కోట, కాకతీయ శిలాతోరణాలు, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, కాకతీయులనాటి గొలుసుకట్టు చెరువైన రామప్ప సరస్సు, గణపురం వీరభద్రస్వామి ఆలయం, ప్రకృతి ఒడిలో ఉన్న అనేక దేవాలయాలు, లక్నవరం సరస్సు, లక్నవరం సరస్సులో సస్పెన్షన్ బ్రిడ్జ్, బోటింగ్, మేడారం సమ్మక్క సారలమ్మల గద్దెలు, పరకాలలో అన్నపూర్ణేశ్వరి ఆలయం, హేమాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఇలా ఈ టూర్ రెండు రోజుల పాటు సాగుతుంది.
తక్కువ ప్యాకేజ్ లతో అద్భుత పర్యాటకం
తెలంగాణ టూరిజం అందిస్తున్న తక్కువ ప్యాకేజీ ధరలతో సౌకర్యవంతంగా ఈ ప్రాంతాలను దర్శించవచ్చు. ఈ సర్క్యూట్ కోసం తెలంగాణ టూరిజం ఏసీ, నాన్ ఏసీ కోచ్ బస్సులను అందిస్తోంది.ఆలయాలతో కూడిన హెరిటేజ్ టూర్, హోటల్లో స్టే చేయడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. వరంగల్, లక్నవరం , రామప్ప ప్రాంతాలలో పర్యాటకుల కోసం అధికారిక హరిత హోటల్స్ అందుబాటులో ఉన్నాయి.
కాకతీయ రీజియన్ టెంపుల్ టూర్.. సో స్పెషల్
వివిధ రకాలుగా ఉన్న ఈ ప్యాకేజీలను బుక్ చేసుకోవడానికి తెలంగాణ టూరిజం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. కాకతీయ రీజియన్ టెంపుల్ టూర్ కేవలం దేవాలయాల దర్శనం మాత్రమే కాదు. తెలంగాణ చారిత్రక సాంస్కృతిక శిల్పకళా వైభవం. ప్రకృతి రమణీయతను మన కళ్ళ ముందు నిలిపి మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే అద్భుత పర్యాటకం. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ అద్భుతమైన టూర్ ను మీరు ఆస్వాదించండి.












Click it and Unblock the Notifications