జూబ్లీహిల్స్ బరిలో కవిత పార్టీ - అభ్యర్ధి ఖరారు..!?
జూబ్లీహిల్స్ కేంద్రంగా రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ అభ్యర్ధులను ఖరారు చేసాయి. అధికారికంగా ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. కాగా, అనూహ్యంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బరిలో తెలంగాణ జాగృతి పార్టీ నుంచి ఓ అభ్యర్థిని బరిలోకి దింపాలని కవిత యోచిస్తున్నట్లు సమాచారం. అభ్యర్ధి పైనా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారుతోంది.
తెలంగాణలో జూబ్లీహిల్స్ పోరు ఇప్పుడు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఇక్కడ గెలుపు కోసం సీఎం రేవంత్.. మాజీ మంత్రి కేటీఆర్ తమ పార్టీలను సమాయత్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్ధి పైన సీఎం రేవంత్ ఒక అంచనాకు వచ్చారు. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి పోటీ చేయటం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్ లో ఈ బై పోల్ కోసం వేగంగా పరిణామాలు మారుతున్నాయి. పోటీ దారుల సంఖ్య పెరుగుతోంది. ఇక.. బీజేపీ తమ అభ్యర్ధి ఖరారు కోసం ఇద్దరి పేర్లను పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం అధికారికంగా తమ అభ్యర్ధిని బీజేపీ నేతలు ప్రకటించనున్నారు. ఇదే సమయంలో అనూహ్యంగా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత.. ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో పోటీ పైన సీరియస్ గా ఆలోచన జరుగుతోంది.

కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో తెలంగాణ జాగృతి పార్టీ నుంచి ఓ అభ్యర్థిని బరిలోకి దింపాలని కవిత యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కవితతో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్ రెడ్డి ఇవాళ(సోమవారం) ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. వీరి భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అరగంటకు పైగా మంతనాలు సాగినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఉప ఎన్నికలో విష్ణువర్ధన్ రెడ్డిని పోటీకి దించే యోచనలో కవిత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. కవిత తన రాజకీయ భవిష్యత్ పైన ఇంకా తుది నిర్ణయానికి రాలేదని చెబుతున్న వేళ.. జూబ్లీహిల్స్ బై పోల్ లో పోటీ అంశం ఆసక్తి కరంగా మారుతోంది. కాగా..కవితను కలిసిన అనంతరం విష్ణువర్థన్ రెడ్డి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దసరా వేడుకలకు మాత్రమే కవితను ఆహ్వానించానని క్లారిటీ ఇచ్చారు. దీంతో.. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో పోటీ పైన తన ఆలోచన ఏంటనేది స్పష్టత ఇచ్చే వరకూ ఈ సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications