కేసీఆర్ దగ్గర ఆ 19మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చిట్టా!!
తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. ఒకపక్క ప్రతిపక్ష పార్టీలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల మద్దతును కూడగట్టడానికి ప్రయత్నం చేస్తుంటే సీఎం కేసీఆర్ మాత్రం వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగవలసిన బలమైన నాయకులు ఎవరు? ఎవరిని రంగంలోకి దింపితే విజయం సాధిస్తాం? ఏ ఎమ్మెల్యేల మీద ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంది? వంటి వివరాలను తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఎమ్మెల్యేలుగా ఉన్న నాయకులకు ప్రజలలో ఉన్న మద్దతును బేరీజు వేసే పనిలో ఉన్న కేసీఆర్ గెలుపు గుర్రాలని రంగంలోకి దించాలని భావిస్తున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇస్తామని కెసిఆర్ చెప్పినప్పటికీ, పనితీరు సరిగా లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి, ఆ స్థానంలో స్థానికంగా పట్టున్న, బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల జాతకాలను, నియోజకవర్గాలలో వారి పరిస్థితిని, ప్రజలలో వారికి ఉన్న పట్టును అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక 19 మంది పనిచేయని ఎమ్మెల్యేల చిట్టా సీఎం కేసీఆర్ వద్ద ఉన్నట్టు పార్టీ శ్రేణులలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత కూడా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనుల్లో బిజీగా ఉన్న, ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో విఫలమైన ఎమ్మెల్యేల లిస్ట్ సీఎం కేసీఆర్ వద్దకు చేరింది. ఇక వీరికి త్వరలోనే క్లాస్ పీకాలని కెసిఆర్ భావిస్తున్నట్లుగా పార్టీ వర్గాలలోనూ చర్చ జరుగుతుంది. పంధా మార్చుకుని ఎన్నికల సమయానికి వారిపై సానుకూల దృక్పధం జనాలకు కలిగితే ఓకే.. లేదంటే అక్కడ విజయావకాశాలు ఉన్న నాయకుడికి అవకాశం ఇవ్వటానికి ఆస్కారం ఉంది.
వచ్చే ఎన్నికలలో అంగబలం, అర్థబలం ఉన్న నాయకులు ఎవరు? ఎవరిని అభ్యర్థిగా చూపిస్తే ఓటర్లు ఈజీగా ఓట్లు వేస్తారు? వంటి వాటిపై ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్న కేసీఆర్ ముచ్చటగా మూడవసారి మళ్లీ గులాబీ జెండాను రెపరెపలాడించాలని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే గత ఎన్నికలలో 5000 ఓట్లని మించి మెజారిటీ ఎక్కువగా రాని ఎమ్మెల్యేలను బయటకు రావద్దని, నియోజకవర్గాలకే పరిమితం అవ్వాలని ఆదేశాలు జారీ చేసిన కేసీఆర్ వచ్చే ఎన్నికల నేపథ్యంలో గతానికి భిన్నంగా చాలా సీరియస్ గా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తున్నారు.
ఈసారి జరగనున్న ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి చావో రేవో అన్నట్టుగా ఉండనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంపై కెసిఆర్ నివేదికలు తెప్పించుకొని, వచ్చే ఎన్నికల అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. చెప్పింది వినకుండా తోక జాడిస్తే కేసీఆర్ కట్ చేస్తారు అని చెప్పటంలో ఎలాంటి డౌట్ లేదని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications