బీజేపీపై ఆట మొదలెట్టిన బీఆర్ఎస్; కేసీఆర్ ఇక తగ్గేదేలే!!
బిజెపిని ఆత్మ రక్షణలోకి నెట్టేలా కెసిఆర్ నయా వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. ఏదైనా తప్పు దొరికినప్పుడు బిజెపి మీనమేషాలు లెక్కిస్తుందేమో కానీ, బిఆర్ఎస్ అలా కాదు అని బండి సంజయ్ అరెస్టుతో స్పష్టంగా చెప్పింది బీఆర్ఎస్. ఇక ఇదే క్రమంలో రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో బిజెపిని ఆత్మరక్షణ లోకి నెట్టి బలంగా ఎదురు దాడి చేయాలని నిర్ణయం తీసుకుంది.
బిఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టాలని ఢిల్లీ లిక్కర్ స్కామ్, సుఖేష్ చంద్రశేఖర్ కేసు, టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును వాడుకుంటున్న బిజెపికి బలంగా సమాధానం చెప్పడానికి బిఆర్ఎస్ రెడీ అయింది. రాష్ట్రంలో బిజెపి నాయకులను ఉక్కిరిబిక్కిరి చేయాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్ తన వ్యూహంలో భాగంగా బిజెపి స్లీపర్ సెల్స్ పై నిఘా పెట్టాలని, వారి వ్యూహాలను ఎప్పటికప్పుడు ముందే గుర్తించి ప్రజాక్షేత్రంలో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని భావిస్తుంది. ఎదురుదాడికి రెడీ అయ్యింది.

బిజెపి తో పాటు బిజెపి అనుబంధ సంఘాలు కూడా క్షేత్రస్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ప్రజలలో వ్యతిరేకతను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక కేంద్ర నాయకత్వం అప్పగిస్తున్న వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ కేంద్రం వ్యూహాలను అమలు చేయడంలో భాగంగా క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి.
ఇక ఇదే విషయాన్ని గుర్తించిన బి ఆర్ ఎస్ అధినేత కెసిఆర్ రానున్న రోజుల్లో ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగొట్టి, అధికార పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందని నివేదికల ద్వారా గుర్తించారు. ఈ క్రమంలో బిజెపి దూకుడుకు చెక్ పెట్టేలాగా తెలంగాణ రాష్ట్రంలో బిజెపి కోసం స్లీపర్ సెల్స్ లాగా పని చేసే వారి పైన నిఘా పెట్టాలని నిర్ణయించారు.
గతంలో జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో కూడా కొన్ని డివిజన్లలో స్లీపర్ సెల్స్ పనిచేశాయని బిఆర్ఎస్ పార్టీలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక బీఆర్ఎస్ యొక్క బలాలను, బలహీనతలను అంచనా వేస్తూ అందుకు తగ్గట్టుగా స్లీపర్ సెల్స్ బిజెపికి అనుకూలంగా వ్యూహాలను రూపొందిస్తున్నట్టు, వాటిని బీజేపీకి అనుకూలంగా ఉన్న వారితో అమలు చేస్తున్నట్టు గుర్తించిన బీఆర్ఎస్ పార్టీ బిజెపి వ్యూహాలకు చెక్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది .
ఇందులో భాగంగానే ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అసలు ఏ విధంగా ప్రశ్నాపత్రాలు బయటకు వచ్చాయి అన్నదానిపై బిఆర్ఎస్ మంత్రులతో పెద్ద ఎత్తున బిజెపి పై ఎదురుదాడి చేయించింది. అంతేకాదు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను జైలుకు పంపించింది. భవిష్యత్ లో కూడా ఇదే తరహా పోరాటం చెయ్యాలని భావిస్తుంది.












Click it and Unblock the Notifications