రేవంత్ రెడ్డిని కలిసిన కొండా దంపతులు.. ఈసారి కొండా సురేఖకు కీలకశాఖ!!
వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఫైర్ బ్రాండ్ కొండ సురేఖ, తెలంగాణ రాష్ట్రంలో కొలువుతీరుతున్న కాంగ్రెస్ మంత్రివర్గంలో స్థానాన్ని దక్కించుకుంటారు అని అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇదే విషయాన్ని ఆమె కూడా అనేక సందర్భాలలో వ్యక్తం చేశారు. మంత్రిగా తనకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పిన కొండా సురేఖ, ఈసారి తెలంగాణాలో ఏర్పాటుకానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తారు అన్నది అందరిలో ఉత్కంఠను రేపుతుంది.
వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కొండ సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దంపతులు నేడు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కొండా సురేఖకు శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అభివృద్ధికి పాటుపడాలని కొండా సురేఖకు రేవంత్ రెడ్డి సూచించారు.

ఇక ఇదే సందర్భంలో తెలంగాణ రాజకీయాలలో సీనియర్ నాయకురాలు అయిన కొండ సురేఖకు ఈసారి మంత్రివర్గంలో కీలక శాఖను కేటాయించేలా హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన కొండ సురేఖ, ఇప్పుడు మళ్లీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చినా, ఆ బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తిగా లేరని సమాచారం.
రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రేవంత్ నాయకత్వాన్ని సమర్ధించి, ఆయనకు మంగళహారతులతో స్వాగతం పలికిన కొండా సురేఖకు కీలకశాఖ కేటాయించే అవకాశం ఉంది. మంత్రివర్గంలో కీలక శాఖకు ప్రాతినిధ్యం వహించి రాష్ట్రంలో మెరుగైన పాలనకు కృషి చేయాలని కొండా సురేఖ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తన మనసులోని మాటను రేవంత్ రెడ్డికి, అధిష్టానానికి వెల్లడించి తనకు ఇచ్చే శాఖపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మొదటి నుంచి కీలక భూమిక పోషించిన కొండ సురేఖ, సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని ఆమెకు మంచి శాఖను కేటాయిస్తే బాగుంటుందని కోరుతున్న వారు లేకపోలేదు. కొండా సురేఖకు హోంశాఖను విద్యాశాఖను గానీ, వైద్య ఆరోగ్య శాఖను గానీ కేటాయిస్తే బాగుంటుందని ఓరుగల్లు వాసులు భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ పై ధిక్కార స్వరాన్ని వినిపించిన కొండ సురేఖకు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మరి ఏ స్థానం దక్కుతుంది? ఆమెకు తగిన ప్రాధాన్యం దక్కుతుందా? అనేది అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications