సురేఖను చూస్తే వైఎస్సార్ ను చూసినట్టే.. తూర్పులో గెలిచేది మేమే: కొండా మురళి!!
ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తంలో వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి కొండా సురేఖ ఎన్నికల బరిలో నిలిచి సాగిస్తున్న ప్రచారమే దీనికి పెద్ద కారణం. వరంగల్ తూర్పు నియోజకవర్గం లో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవెయ్యాలని సంకల్పంతో ఉన్న కొండా సురేఖ వ్యూహాత్మకంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
Recommended Video

కొండా సురేఖ తరఫున కొండా మురళి కూడా ప్రచార పర్వంలో పాల్గొంటూ ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.అయితే ఈ దఫా ఎన్నికలలో కొండా మురళి కూడా పోటీ చేస్తారని భావించిన వేళ తాను ఎన్నికలలో పోటీ చేయకపోవడం వెనుక కారణాన్ని కొండా మురళి వన్ఇండియా తో వెల్లడించారు.

తనకు పరకాల నియోజకవర్గంలో టికెట్ ఇస్తామని చెప్పినప్పటికీ, సురేఖను గెలిపించడమే ధ్యేయంగా తాను పరకాల నియోజకవర్గం వదిలి పెట్టానని పేర్కొన్నారు. కొండ సురేఖ గెలిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆమె ఏ అధికారుల వద్దకు వెళ్ళినా వైయస్సార్ ను చూసినట్టే చూస్తారని కొండా మురళి పేర్కొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, గతంలో కొండా సురేఖ హయంలో జరిగిన అభివృద్ధి తప్ప వరంగల్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు.
అభివృద్ధిపై దమ్ముంటే నన్నపనేని నరేందర్ చర్చకు వస్తాడా? అంటూ సవాల్ విసురుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సారధ్యంలో 75 సీట్లను గెలుస్తుందని కొండా మురళి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు కొండా సురేఖ నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారని, ఏ డివిజన్లో చూసిన పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నాయని కొండా మురళి చెబుతున్నారు.

సీఎం కేసీఆర్ పని అయిపోయిందని ఆయన తేల్చి చెప్తున్నారు. నియోజకవర్గంలో ఎవరిని అడిగినా సురేఖ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధిని మాత్రమే చెబుతున్నారని, ఆ తర్వాత జరిగింది శూన్యమని కొండా మురళి చెబుతున్నారు. ఈ ఎన్నికలలో 200% కొండా సురేఖ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నన్నపునేని నరేందర్ హయాంలో చేసిందేమీ లేదని, ఆ అసమర్ధత తమను గెలిపిస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రజలు అభివృద్ధి కోసం మళ్లీ కొండా సురేఖను ఆదరిస్తారని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి . స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications