జైలుకు వెళ్ళాలనే కేటీఆర్ ఆరాటం... ఆ ప్లాన్ అందుకే కాబోలు: మంత్రి సీతక్క!
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల పైన వాడి వేడి చర్చ కొనసాగుతుంది. మరో వారం రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రాబోతుందని తెలంగాణ మంత్రులు మాట్లాడారని చర్చ ఆసక్తికరంగా మారింది .ముఖ్యంగా తెలంగాణ మంత్రి పొంగులేటి, మంత్రి తుమ్మల తో పాటు మంత్రి సీతక్క స్థానిక సంస్థల ఎన్నికల పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.
స్థానిక సంస్థల ఎన్నికల వ్యాఖ్యలపై సీతక్క క్లారిటీ
మంత్రి పొంగులేటిపైన టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్ స్థానికసంస్థల ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు, ఈ క్రమంలో మంత్రి సీతక్క తాను చేసిన వ్యాఖ్యలపైన క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పైన కూడా సీతక్క సెటైర్లు వేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని తాను చెప్పలేదని, స్పష్టత వస్తుందని మాత్రమే తాను చెప్పానని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

బీసీలకు రిజర్వేషన్ పై మాట్లాడిన మంత్రి సీతక్క
క్యాబినెట్ లో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా తాను ఎలా చెబుతాను అంటూ ఆమె అన్నారు . నేడు మీడియాతో మాట్లాడిన ఆమె స్థానిక సంస్థల ఎన్నికలపై ఈరోజు స్పష్టత వస్తుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నాయని మంత్రి సీతక్క వెల్లడించారు. బీసీలకు రిజర్వేషన్ల అంశం పైన ఈరోజు స్పష్టత వస్తుందని సీతక్క పేర్కొన్నారు.
జైలుకు వెళ్లాలని కేటీఆర్ కు కుతూహలంగా ఉంది
ఇక ఇదే సమయంలో ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణపై మాట్లాడిన సీతక్క చాలా పొగరుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏదో ఆశించి కేటీఆర్ జైలుకు పోవాలని భావిస్తున్నాడని ఆమె అన్నారు. జైలుకు వెళ్లాలని కేటీఆర్ కు బాగా కుతూహలంగా ఉందని అభిప్రాయపడ్డారు .కవిత జైలుకు వెళ్లి రాగానే లిక్కర్ కేసు పై దృష్టి మళ్లించేందుకు బీసీలు, మహిళలు, దళితులు అంటూ లేనిపోని ప్రేమ ఒలకబోస్తున్నారని అన్నారు.
కేటీఆర్ జైలుకు వెళ్లాలని భావిస్తున్నారు అందుకే
ఇక కేటీఆర్ కూడా సానుభూతి కోసమో, లేదంటే ప్రజలను రెచ్చగొట్టడం కోసమో జైలుకు వెళ్లాలని భావిస్తున్నట్టుగా ఉన్నారని సీతక్క పేర్కొన్నారు. ప్రభుత్వం చట్ట ప్రకారమే నడుస్తుందని సీతక్క తెలిపారు. తమ ప్రభుత్వానికి ఎటువంటి కక్షసాధింపు చర్యలు లేవని, ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడితే ప్రభుత్వం రాగానే వారిని జైల్లో వేసేవాళ్ళం కదా అంటూ ప్రశ్నించారు. కక్షలు, కార్పణ్యాలు బీఆర్ఎస్ వాళ్లకే ఉంటాయని సీతక్క స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications