కేంద్రం వివక్ష చూపుతోంది: వీటిలో పోటీ పడండి, అమిత్ షాకు మంత్రి కేటీఆర్ సవాల్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో రూ.119 కోట్లతో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్లతో కలిసి శనివారం ప్రారంభించారు. వెంకంపల్లి వద్ద రూ.55 కోట్లతో పేరూరు ఎత్తిపోతల పథకం, వర్నె వద్ద వర్నె-ముత్యాలంపల్లి హైలెవల్ వంతెన, జాతీయ రహదారి నుంచి గుడిబండకు బీటీ రహదారి, పోతులమడుగు వద్ద మినీ స్టేడియం, వెజ్-నాన్‌వెజ్ మార్కెట్, 12 కోట్లతో బీటీ రహదారులకు శంకుస్థాపన చేశారు. 15.26 కోట్లతో సిద్దాయపల్లిలో నిర్మించిన 288 రెండు పడకల గదులను మంత్రులు ప్రారంభించారు.

బీజేపీ నేతలు వీటిలో పోటీపడాలంటూ కేటీఆర్
అనంతరం అమిస్తాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం, బీజేపీపై విమర్శలు గుప్పించారు. మసీదులు తవ్వడం కాదు.. ప్రాజెక్టులు, పేదల ఇళ్లకు పునాదులు తవ్వడంలో పోటీ పడాలని బీజేపీ నేతలకు మంత్రి కేటీఆర్ సూచించారు. నిర్మాణాత్మక విమర్శలు చేయాలే తప్ప.. కులమతాల పేరుతో పంచాయితీలు పెట్టి రాజకీయంగా లబ్ది పొందాలని ప్రయత్నించొద్దని కేటీఆర్ హితవు పలికారు. కేసీఆర్ సర్కారు దేవాలయాలను నిర్మిస్తోందని.. అదే సమయంలో ఆధునిక దేవాలయాలైన ప్రాజెక్టులూ నిర్మిస్తోందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

అమిత్ షాకు కేటీఆర్ సవాల్
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని మహబూబ్ నగర్ వేదికగా ప్రధాని మోడీ, గతంలో సుష్మాస్వరాజ్ చెప్పారని.. ఇప్పటికీ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.8 ఏళ్లలో దానికి ఒక్కపైసా కూడా రాలేదు. వికారాబాద్-కర్ణాటక, గద్వాల-మాచర్లకు రైలు అడిగినా ఇవ్వలేదు. నేను చెప్పింది తప్పైతే నా మంత్రి పదివికి రాజీనామా చేస్తా. లేదంటే కేంద్రమంత్రి అమిషా తప్పు అంగీకరించి ముక్కు నేలకు రాయాలని కేటీఆర్ సవాల్ విసిరారు.

కేంద్రం నిధులా? అంటూ కేటీఆర్ ప్రశ్న
8ఏళ్లుగా కృష్ణా జలాల్లో 575 టీఎంసీల నీటివాటాను తెలంగాణను అడుగుతుంటే కేంద్రం నోరుమెదపడం లేదని, పైగా కేసీఆర్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వికారాబాద్-కృష్ణా, గద్వాల-మాచర్ల రైల్వే లైన్లు మంజూరు చేయమంటే ఇవ్వలేదని విమర్శించారు. కేంద్రం నిధులతోనే తెలంగాణ పథకాలు అమలై ఉంటే.. అవే పథకాలు పక్కనున్న కర్ణాటకలో అమలవుతున్నాయా? చూపించాలని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications