అక్షింతలు పడినా.. అదే బాట.. ఏకపక్షంగా భూసేకరణ బిల్లుకు ఆమోదం

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కేంద్ర భూ సేకరణ చట్టం - 2013 వెలుగులో తెలంగాణ భూసేకరణ చట్టానికి సవరణ బిల్లును ప్రాతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం తీరు విమర్శలకు తావిచ్చేదిగా ఉన్నది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీతోపాటు అధికార టీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం సభ్యులు మాత్రమే హాజరైన సభలో ఆదివారం కేంద్రం సూచనల మేరకు మాత్రమే భూసేకరణ చట్టం సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం పొందే విషయంలో అధికారపక్షం ఏకపక్షంగా వ్యవహరించిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

రైతుల సంక్షేమంలో కీలకమైన ఈ సవరణ బిల్లు ఆమోదానికి ముందు కనీస స్థాయి చర్చ జరుగడం పద్ధతి. దీనికి తోడు బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల కొనసాగింపుగానే ఈ సమావేశాలు జరుగుతున్నాయని, నాటి నిషేధమే తెలుగుదేశం, బీజేపీ ఎమ్మెల్యేలకు వర్తిస్తుందని అధికార పక్షం చెప్పి, వారిని సమావేశానికి హాజరు కాకుండా చేయడం వెనుక ప్రభుత్వ నియంత్రుత్వ ధోరణిని తెలియజేస్తున్నదని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.

ఒకవైపు సవరణ బిల్లు ఆమోదానికి ఆత్రుత ప్రదర్శించిన సర్కార్.. మిర్చి తదితర పంటలు పండించిన రైతుల కడగళ్లపై చర్చకు తావు లేకుండా ముగించడం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం పట్ల తనకు శ్రద్ధ లేదని రుజువు చేసుకున్నదని భావిస్తున్నారు.

kcr

ప్రగతి, సంక్షేమం సరే.. రైతుల సమస్యల మాటేమిటి?
ప్రగతి, సంక్షేమం.. వసతుల కల్పన.. ఉపాధి అవకాశాల మెరుగుదలకు పరిశ్రమలు కావాలి. వరి తదితర పంటలు సాగు చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులు అవసరం. ఆ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి భూమి సేకరించాలి. అలా భూ సేకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్ట పరంగా ముందుకు వెళితేనే సమస్యలు ఉండవు. కానీ తెలంగాణ ఆవిర్భావం మొదలు ఇప్పటివరకు రాష్ట్ర ప్రగతి సాధనే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదనలో డొల్లతనం స్పష్టంగా బయట పడింది.

ప్రాజెక్టుల నిర్మాణానికి జీవోలతోనే భూసేకరణ.. అన్నివైపులా అడ్డంకులు
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి, పరిశ్రమలు, ఇతర అభివ్రుద్ధి ప్రాజెక్టులకు అవసరమై భూ సేకరణకు కేవలం జీవోలే ప్రధానంగా ముందుకు వెళ్లిందీ రాష్ట్ర ప్రభుత్వం. కానీ అన్ని వైపుల నుంచి అడ్డంకులు ఎదురు కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో 2013లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన భూసేకరణ చట్టం వెలుగులో ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో 'తెలంగాణ భూసేకరణ బిల్లు' రూపొందించి, రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. భూ సంబంధ అంశాల్లో రాష్ట్రాలు ఆమోదించే చట్టాలకు కేంద్రం ఆమోదం తప్పనిసరి.

రాష్ట్ర చట్టంలోని పొరపాట్లను ఎత్తి చూపిన కేంద్రం
అయితే తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన భూ సేకరణ బిల్లులో పొరపాట్లను కేంద్ర న్యాయశాఖ గుర్తించి, వాటిని సవరించి పంపాలని కేంద్రం ఆదేశించింది. దీనిపై కేంద్ర న్యాయ, హోంశాఖ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ జరిపిన చర్చల్లో అంగీకారం మేరకు ఆదివారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి ప్రత్యేక సమావేశాల్లో సవరణ బిల్లు ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో భూసేకరణ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలు, చేసిన వ్యాఖ్యలు ఒకసారి పరిశీలిద్దాం..

ఆదిలోనే హంసపాదు
తెలంగాణ ప్రభుత్వ ఆవిర్భావం తర్వాత భారీస్థాయిలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అక్కడే 'తప్పు'లో కాలేసింది. భూసేకరణకు '123' నంబర్ జీవో జారీ చేసింది. ఆయా పరిస్థితులకు అనుగుణంగా మరికొన్ని అనుబంధ జీవోలు జారీ చేసింది. వలసలకు నిలయమైన పాలమూర్ - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదలు సీతారామ ప్రాజెక్టుతోపాటు ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్ జిల్లాలకు వర ప్రదాయినిగా భావిస్తున్న కాళేశ్వరం, తుమ్మిడిహళ్లి, మల్లన్న సాగర్ తదితర ప్రాజెక్టులకు ఇదే కార్య నిర్వాహక ఆదేశాలు జారీ చేసి భూసేకరణకు పూనుకున్నది.

జీవో అమలుపై హైకోర్టులో పిటిషన్లు.. తెలంగాణ వ్యతిరేకమని సర్కార్ ప్రచారం
కానీ పాలమూర్ - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి 123 జీవో అమలు ద్వారా భూసేకరణ, ప్రాజెక్టుల నిర్మాణంపై గ్రీన్ ట్రిబ్యునళ్లలో కేసు నలుగుతోంది. ఈ క్రమంలో దీనికి కూడా తెలంగాణ ప్రభుత్వం విపక్షాలను నిందించేందుకు పూనుకున్నది. హైకోర్టు అక్షింతలు వేసినప్పుడల్లా ప్రతిపక్ష పార్టీలనే ఆడిపోసుకున్నది. దానికి ఆంధ్ర పార్టీల కుట్ర అని రంగు కూడా పులిమింది. మల్లన్న సాగర్ రాష్ట్ర ప్రగతికి సోపానాలు కానున్నదని రైతు సమాఖ్యల పేరిట ప్రతిపక్షాలపై విమర్శలకు సభలు, సదస్సులు నిర్వహింపజేసేందుకు కూడా వెనుకాడలేదు. రాష్ట్ర ప్రగతికి అడ్డుగోడలు కడ్తున్నాయని నిందారోపణలు చేస్తూ వచ్చింది.

మూడేళ్ల తర్వాతా సెంటిమెంట్ రగిల్చేందుకే ప్రభుత్వం ప్రాధాన్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోయిన మూడేళ్ల తర్వాత కూడా అదే ఆరోపణలతో కాలం గడుపుతూ తెలంగాణలోని సబ్బండ వర్ణాలను కూడా మభ్య పెడుతోంది. చివరకు '123' జీవో అమలు చేయవద్దని హైకోర్టు స్పష్టంగా తేల్చి చెప్పిన తర్వాతే గానీ తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ భూ సేకరణ చట్టాన్ని ఆమోదించిందే తప్ప.. అప్పుడూ విపక్షాలను నిందించడానికే పూనుకున్నది. తాజాగా బిల్లుకు సవరణలు ప్రతిపాదించాలన్న కేంద్ర హోం, న్యాయశాఖల సూచనలకు అనుగుణంగానే చట్టానికి సవరణలు చేయడానికి పూనుకున్నది.

బిల్లు ఆమోదం సరే.. అసలు కేంద్రచట్టంతో భూసేకరణకు అడ్డంకులేమిటి?
కానీ ప్రాజెక్టుల నిర్మాణానికి తొందరే ఉంటుందని, రైతుల సమస్యల గురించి చర్చించాలన్న టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అసలు నాయకుడేనా అని ప్రశ్నించిన తుమ్మల నాగేశ్వర్ రావు ఒక విషయం విస్మరిస్తున్నారు. 2013లో కేంద్రం ఆమోదించిన చట్టం ప్రకారమే భూ సేకరణ చేయాలని ప్రతిపాదించినప్పుడు దానివల్ల రైతుకు నష్టం వాటిల్లుతుందని, మార్కెట్ రేటు కంటే అత్యధికంగా నష్ట పరిహారం చెల్లిస్తామని నమ్మ బలికిందీ ఆయన సహచర మంత్రి, సాగునీటి వ్యవహారాలశాఖ మంత్రి టీ హరీశ్ రావు అన్న సంగతి అందరికీ తెలుసు. మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణలో రైతుకు రక్షణ కల్పించేందుకే కేంద్రం 'భూసేకరణ చట్టం - 2013' తెచ్చిందన్న సంగతి అందరికీ తెలుసు.

తొలుత మొండి వైఖరి ప్రదర్శించిన మోదీ సర్కార్
కానీ 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం పలు దఫాలు ఆర్డినెన్స్ ద్వారా, తర్వాత భూసేకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదం ద్వారా దూసుకెళ్లాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ రాజ్యసభలో మైనారిటీలో ఉన్న కారణంగా మోదీ సర్కార్ ఆటలు సాగలేదు. అనివార్యమైన పరిస్థితుల్లోనే 2013 భూసేకరణ చట్టం అమలుకు పూనుకుంటున్నది. వాస్తవంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలంటే పట్టా భూముల పరిహారం భారీగా ఉంటుంది. అందువల్లే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో కాలం గడుపాలని భావించిన తెలంగాణ ప్రభుత్వానికి తాజాగా కేంద్రం ఆదేశాలే పరిష్కార మార్గంగా కనిపిస్తున్నది.

2014లోనే కేంద్ర చట్టం అమలుతో సత్ఫలితాలు
తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరినప్పుడే ఇదే 2013 చట్టం అమలు ద్వారా వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించి ఉంటే ఈ పాటికి భూ సేకరణ పూర్తయి ఉండేది. తద్వారా ఆయా ప్రాజెక్టులు, పథకాల నిర్మాణానికి పూనుకునే అవకాశం లభించేది. ఏకపక్ష వైఖరితో ముందుకు వెళ్లినందుకు హైకోర్టు అక్షింతలు వేసిన తర్వాతైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవడంతో ఇప్పటికైనా ప్రజా ప్రయోజనకరంగా సాగునీటి, మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూమి సేకరించి ప్రజలకు మెరుగైన పాలన అందిస్తారని ఆశిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana assembly, legislative council as apporved land acuiqution bill - 2017 with voice vote.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి