Foxconn:కొంగరకలాన్‍లో ఫాక్స్‌కాన్ ప్లాంట్.. భూమి కొనుగోలుకు సిద్ధమైన సంస్థ..
తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలు కూడా హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే తైవాన్‌కు చెందిన బహుళజాతి ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ తయారీదారు ఫాక్స్‌కాన్(foxconn) ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా కొంగర కలాన్‌లోని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిఎస్‌ఐఐసి) పార్క్‌లో సుమారు 186 ఎకరాలను రూ.196 కోట్లకు కొనుగోలు చేయాలని ప్రతిపాదించింది.
ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ లిమిటెడ్ (ఎఫ్‌ఐటి), దాని పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ చాంగ్ యి ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా, హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్ వద్ద 186.7 ఎకరాలను సేకరించేందుకు ప్రతిపాదించింది. ప్లాట్‌ను 23.8 మిలియన్ US డాలర్లకు (సుమారు రూ.196 కోట్లకు సమానం) కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయాన్ని TSIIC సీనియర్ అధికారి కూడా ధృవీకరించారు.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఫాక్స్‌కాన్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. అందులో కర్మాగారాలు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, వసతి గృహాలను నిర్మించడం కోసం ఈ ప్రతిపాదిత భూ సేకరణ అని పేర్కొంది. ప్రతిపాదిత భూసేకరణకు సంబంధించిన అంశాలను మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పలు చర్చల తర్వాత నిర్ణయిస్తామని పేర్కొంది. ఫాక్స్ కాన్ ప్రపంచంలోనే 70 శాతం ఐఫోన్‌లను అసెంబుల్ చేసే బహుళజాతి ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ తయారీదారుగా ఉంది.
తెలంగాణలోని కొంగర కలాన్ పార్కులో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు తన కంపెనీ సిద్ధంగా ఉందని ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ చైర్మన్ యంగ్ లియు మార్చి 6న ప్రకటన చేశారు. అంతకుముందు, టి వర్క్స్‌ను ప్రారంభించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా, యంగ్ లియు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో విస్తృతంగా సమావేశమయ్యారు. తైవాన్‌కు తిరిగి వెళ్లిన వెంటనే, యంగ్ లియు కూడా తెలంగాణ అభివృద్ధికి BRS ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
ఫాక్స్ కానే కాదు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి అనేక సంస్థలు ఇప్పిటికే తెలంగాణ పెట్టుబడులు పెట్టాయి. తెలంగాణలో ఏడాదికేడాది పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications