జువెలరీ షాపులో సైనైడ్ తిని రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడంటే..?
బంగారం షాపులో సైనైడ్ తిని రెండేళ్ల చిన్నారి మరణించిన షాకింగ్ ఘటన హైదరాబాద్ లోని చింతల్ లో జరిగింది. ఈ నెల 7న బంగారం కొనేందుకు ఓ మహిళ తన కుమార్తె(2)తో దుకాణానికి వెళ్లింది. అయితే ఆమె నగలు చూస్తుండగా, చిన్నారి అక్కడ టేబుల్ పై పెట్టిన సైనైడ్ నోట్లో పెట్టుకుంది. దీంతో వెంటనే స్పృహ కోల్పోగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. దాంతో జువెలరీ షాప్ ముందు తల్లిదండ్రుల ఆందోళన చేపట్టారు. జువెలరీ షాపు యాజమాన్యం నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణాలు పోవడానికి కారణం అని ఆరోపించారు. అయితే బంగారం స్వచ్ఛతను పరీక్షించేందుకు సైనైడ్ ను సాధారణంగా వినియోగిస్తుంటారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపీకృష్ణ, జానకి దంపతులు. వీరికి రెండేళ్ల పాప మిషా ఉంది. ఈ కుటుంబం హైదరాబాద్ నగర పరిధిలోని చింతల్ లో నివాసం ఉంటున్నారు. అయితే దసరా పండగ నేపథ్యంలో పాపకు చెవి కమ్మలు కొనేందుకు తల్లి చిన్నారిని తీసుకుని చింతల్ లోని ఓ జ్యువెల్లరీ స్టోర్ కు వెళ్లింది. తల్లి ఆభరణాలు చూస్తుండగా.. చిన్నారి మిషా అక్కడే ఆడుకుంటూ ఉంది. అయితే బంగారాన్ని పరిశీలించేందుకు ఉపయోగించే రసాయనం సైనెడ్ ను మిషా అక్కడ గుర్తించింది. అదేంటో తెలియక నోట్లో పెట్టుకుంది. సైనైడ్ కడుపులోకి వెళ్లి చిన్నారి అపస్మారక స్థితిలోని వెళ్లింది. ఇది గమనించిన తల్లి వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్పించింది. అయితే అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మిషా ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకొన్నాయి.

అయితే గోల్డ్‌షాప్ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మృతి చెందిందంటూ చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు జ్యువెల్లరీ స్టోర్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ విషయమై స్థానికంగా ఉన్న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విష్ణు జ్యువెలర్స్ నిర్లక్ష్యంతోనే మా పాప చనిపోయిందని.. షాపు యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని కోరారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications
