మైనర్ బాలిక హత్య కేసులో తండ్రే నిందితుడు: కోరిక తీర్చలేదనే ఘోరం
హైదరాబాద్: నగరంలోని మియాపూర్‌లో కలకలం రేపిన మైనర్ బాలిక అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. పన్నేండేళ్ల బాలిక మర్డర్ కేసులో ఆమె తండ్రే ప్రధాన నిందితుడిగా తేల్చారు. తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే ఆమెను దారుణంగా హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు.
ఈ కేసులో సీసీటీవీలో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా చేపట్టిన దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చిందని మియాపూర్ ఏసీపీ నరసింహారావు తెలిపారు. పోర్న్ వీడియోలు చూడడం, మద్యపానానికి బానిసైన తండ్రి.. కుమార్తెను కోరిక తీర్చాలని వేధించాడు. ఆ చిన్నారి నిరాకరించడంతోపాటు తల్లికి చెప్తాననడంతో.. ఆగ్రహానికి గురైన తండ్రి ఆమెను హతమార్చాడని పోలీసులు తెలిపారు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన నిందితుడు భార్య, కుమార్తెతో కలిసి బతుకుదెరువు కోసం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిగడ్డ తండాకు వలసవచ్చారు. ఇక్కడకు వచ్చిన 15 రోజుల్లోనే నిందితుడు పోర్న్ వీడియోలు, మద్యానికి బానిసగా మారి కన్నబిడ్డపైనే కన్నేశాడు. కామవాంఛతో కర్కశంగా ప్రవర్తించేవాడు.
ఈ క్రమంలోనే తన కోరిక తీర్చాలంటూ బాలికపై ఒత్తిడి తెచ్చాడు . దీంతో ఆ బాలిక అమ్మకు చెప్తానని గట్టిగా అరవడంతో నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి ఆమెను జుట్టుపట్టి నేలకొసి కొట్టాడని అనంతరం బండరాయితో మోది హత్య చేశాడని ఏసీపీ వెల్లడించారు. అక్కడ్నుంచి బయటకు వచ్చిన నిందితుడు బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లి నిర్ధారించుకున్నాడని ఏసీపీ తెలిపారు.
ఇలా వరుసగా మూడు రోజులపాటు బాలిక మృతదేహాన్ని చూడడానికి ఘటనాస్థలానికి వెళ్లాడన్నారు. కానీ, హత్య చేసిన రోజే తన కూతురు కనిపించడం లేదని నిందితుడు భార్యతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో తండ్రి బాలిక మృతదేహం లభ్యమైన ప్రదేశానికి వెళ్లడం సీసీటీవీ గమనించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో విచారించగా తానే హత్య చేశానని అంగీకరించాడు.
వారం రోజుల పాటు అసలు విషయం చెప్పకుండా దాచిపెట్టాడని ఏసీపీ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టులో హాజరు పరచనున్నారు. కన్నకూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications