ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం: ఆకాష్‌పై కేసు నమోదు
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) శుక్రవారం తెల్లవారుజామున కారు ప్రమాదంలో మృతి చెందిన విషయం విధితమే. ఈ ఘటనపై ఎమ్మెల్యే లాస్య సోదరి నివేదిత పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్ ఆకాశ్ నిర్లక్ష్యంగా కారు నడిపాడని లాస్య సోదరి నివేదిత తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అతివేగంగా కారు నడిపి ఎమ్మెల్యే లాస్య మృతికి కారణమయ్యాడని, కారు డ్రైవర్ ఆకాశ్‌పై సెక్షన్ 304 ఏ కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. ముందువెళ్తలున్న వేరే వాహనాన్ని లాస్య కారు ఢీకొట్టినట్లుందని, ఎమ్మెల్యే సీటు బెల్టు కూడా పెట్టుకున్నట్లే ఉన్నారని ఆయన వెల్లడించారు. డ్రైవర్ నిద్రమత్తులో కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

ప్రమాద ఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరా లప్రకారం.. గురువారం సదాశివపేటకు వెళ్లి వచ్చిన లాస్య నందిత శుక్రవారం ఉదయం అల్పాహారం కోసమని ఇంటి నుంచి బయల్దేరారు. శామీర్‌పేట వద్ద కారు ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పైకి చేరుకుంది. మరికొద్ది సేపట్లో ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ అవుతుందనుకున్న సమయంలో.. సుల్తాన్‌పూర్ వద్ద లాస్య ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తోన్న టిప్పర్‌ను ఢీకొట్టింది.
ఆ తర్వాత నియంత్రణ కోల్పోయి రహదారి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. రోడ్డు ప్రమాదం పటాన్‌చెరు పీఎస్ పరిధిలో జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తలకు బలమైన గాయం, ఇంటర్నల్ బ్లీడింగ్ వల్లే లాస్య నందిత చనిపోయినట్లు పోస్టుమార్టం చేసిన వైద్యులు తెలిపారు. పోస్టుమార్టంను వీడియోగ్రఫీ చేసినట్లు, ఆ నివేదిక వచ్చేందుకు సమయం పడుతుందని పోలీసులు తెలిపారు.
కాగా, తొలిసారి ఎమ్మెల్యే అయిన లాస్య నందిత మరణంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. లాస్య కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా లాస్య మృతి పట్ల సంతాపం తెలిపారు. మరోవైపు, లాస్య నందిత కారు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు.
ల్యాస నందిత అంతిమయాత్రలో పాడే మోసిన హరీశ్ రావు
లాస్య నందిత అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య శుక్రవారం సాయంత్రం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొని ఆమె పాడె మోశారు.












Click it and Unblock the Notifications