నాన్నా.. ఎప్పుడు దిగిపోతావ్? ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కూతురు పోరు!!
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కూతురు పోరు తప్పడం లేదు. తండ్రి అవినీతిపై, భూ కబ్జాలపై బాహాటంగానే విమర్శలు చేస్తూ, పోలీస్ స్టేషన్లో తండ్రిపైన ఫిర్యాదు చేసిన తనయ తాజాగా మరోమారు తన తండ్రిని టార్గెట్ చేసింది. నాన్న ఎప్పుడు దిగి పోతావు అంటూ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కుమార్తె తుల్జా భవాని ప్రశ్నించింది. ఇంత జరుగుతున్న ఎమ్మెల్యే పదవికి నువ్వెందుకు రాజీనామా చేయడం లేదు అంటూ తండ్రిని నిలదీసింది.
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన కుమార్తె తుల్జా భవాని రెడ్డి తనపై చేసిన భూకబ్జా ఆరోపణలతో పాటు అవినీతి ఆరోపణలపై మీడియా ముఖంగా స్పందించడం మాత్రమే కాకుండా తన కుమార్తె, అల్లుడు తన కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని గత నెలలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ నెల 22వ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.

ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తమ కార్యక్రమాలు అడ్డుకోకుండా తన కుమార్తెను అల్లుడిని నిరోధించాలని పిటిషన్లో కోరారు. దీనిని విచారించిన హైకోర్టు ధర్మాసనం ఆయన కుమార్తె, అల్లుడికి నోటీసులు జారీ చేసింది. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఫిర్యాదుపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని జనగామ, చేర్యాల పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
పోలీసులు వారిపై కేసు నమోదు చేసి కేసు విచారణ నిమిత్తమై తుల్జా భవాని రెడ్డి బంధువు రామకృష్ణను పోలీస్ స్టేషన్ కు పిలిపించగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అల్లుడు, కూతురు సైతం జనగామ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఆయన అధికారిక కార్యక్రమాలను తాము ఎప్పుడు అడ్డుకోలేదని తుల్జా భవాని రెడ్డి పోలీసులకు తెలిపారు.
తాను చేర్యాల భూమిని మునిసిపాలిటీకి ఇచ్చిన తర్వాత తన తండ్రి స్వాగతిస్తున్నాను అని చెప్పారని, ఇప్పుడు కేసులు పెట్టి తమను ఇబ్బంది పెడుతున్నారని తుల్జా భవాని రెడ్డి పేర్కొన్నారు.తాను ఆ భూమిని కబ్జా చేశాను అని తన తండ్రి ఓపెన్ గానే ఒప్పుకున్నారని, మరి ఆయన పదవిలో ఎలా ఉంటారంటూ ప్రశ్నించారు.
ఇంకా ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయడం లేదని తుల్జా భవాని రెడ్డి నిలదీశారు. భూ కబ్జా చేసిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కన్న కూతురిపై తండ్రి కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని తుల్జా భవాని రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications