మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ.. ఏం చేస్తారంటే!!
తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా భావించే పండుగలలో బతుకమ్మ పండుగకు విశిష్ట స్థానం ఉంది. తెలంగాణా సంస్కృతీ, సాంప్రదాయాలకు పట్టం కడుతూ, ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండుగ పితృ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమవుతుంది. బతుకమ్మ సంబరాలు తొమ్మిది రోజులపాటు ఘనంగా సాగుతున్నాయి. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ ఆటలు ఆడిన మహిళలు, అటుకుల బతుకమ్మను ఘనంగా నిర్వహించుకున్నారు.
తొమ్మిది రోజులలో గౌరమ్మకు రకరకాల నైవేద్యాలు పెడుతూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. మహాలయ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మను పేర్చి నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి సమర్పించారు. ఆపై అటుకుల బతుకమ్మ నాడు అమ్మవారికి సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో వండిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి తిధి నాడు అటుకుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. ఇక అటుకుల బతుకమ్మను చిన్నపిల్లలు సంబరంగా జరుపుకున్నారు.

ఆపై నేడు మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మను ఘనంగా నిర్వహించడానికి మహిళలు రెడీ అవుతున్నారు. మూడో రోజు నిర్వహించే బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజున ముద్దపప్పు, పాలు, బెల్లంతో తయారు చేసిన పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
ప్రతిరోజు తంగేడు పూలు, గునుగు పూలు, కట్ల పూలు, బంతి, మల్లె, చామంతి, సంపెంగ, గులాబీ, రుద్రాక్షలు, సీత జడలు వంటి రకరకాల పూలతో బతుకమ్మని పేర్చి తొమ్మిది రోజుల సంబరాన్ని మహిళలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆడపడుచుల ఆటపాటలతో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను పూజిస్తూ బతుకమ్మను గంగమ్మ లో నిమజ్జనం చేస్తారు.
బతుకమ్మలో భాగంగా ఊరూరా జానపద పాటలతో తెలంగాణా సంస్కృతిని, తెలంగాణా ప్రజల జీవన సౌందర్యాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అక్టోబర్ 14 నుండి ప్రతీ రోజూ అమ్మవారిని రకరకాల నైవేద్యాలు పెట్టి విశేషంగా పూజిస్తున్నారు. బతుకునిచ్చే తల్లిగా బతుకమ్మను కొలుస్తున్నారు . పేద, ధనిక తారతమ్యం లేకుండా అంతా కూడి ఆడి పాడి అమ్మవారిని పూజిస్తున్నారు.












Click it and Unblock the Notifications