కేబీఆర్ పార్క్ ఎలివేటేడ్ కారిడార్ కోసం కోట్ల విలువైన ఇంటి స్థలం ఇస్తున్న బాలకృష్ణ!
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు, నగర ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం సూచించేందుకు రూ.1,090 కోట్లతో 4.3 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసం జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులకు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముందుకొచ్చారు.
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 జంక్షన్ వద్ద ఉన్న తన నివాసం నుంచి సుమారు 862.77 చదరపు గజాల స్థలాన్ని ఎలివేటేడ్ కారిడార్ కోసం ఇవ్వటానికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అంగీకరించారు. ఈ ఇల్లు 1982లో ఆయన తండ్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు నిర్మించారు. దశాబ్దాలుగా బాలకృష్ణ కుటుంబం ఇక్కడే నివసిస్తోంది. ఇంట్లో సగం భాగం కూల్చివేయాల్సి రావడంతో ఆయన మరో చోటికి మారాల్సి ఉంటుంది.

అయినా ఆయన నగదు పరిహారం తీసుకోకుండా ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ టీడీఆర్ సర్టిఫికెట్లను మాత్రమే అంగీకరించారు.కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణకు ఆయన 862.77 చదరపు గజాలు ఇచ్చినప్పుడు నగదు తీసుకోకుండా TDR సర్టిఫికెట్లు తీసుకోవటం అంటే ఆయనకు మరో చోట అదనపు నిర్మాణ హక్కులు పొందటంగా చెప్పొచ్చు.. అదే విధంగా శబ్దాలయ స్టూడియోస్ సుమారు 608 చదరపు గజాలు, భవ్య కన్‌స్ట్రక్షన్స్ 341.33 చదరపు గజాల స్థలాన్ని అందించనున్నాయి.
ఈ ప్రాంతంలో భూమి విలువ గజానికి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల మధ్య ఉంది. జీహెచ్‌ఎంసీ ఈ పనులను కేబీఆర్ పార్క్ వన్-వే ట్రాఫిక్ వ్యవస్థను శాశ్వతం చేసే క్రమంలో చేపడుతోంది. ముఫఖంజా కాలేజీ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు 4.3 కిలోమీటర్ల ఆరు వరుసల స్టీల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం ఈ భూసేకరణ జరుగుతుంది.
ఆరు వరుసల ఈ స్టీల్ ఎలివేటేడ్ కారిడార్ వ్యయం సుమారు 1,090 కోట్ల రూపాయలు. ఈ కారిడార్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, నాలెడ్జ్ సిటీ, హైటెక్ సిటీ వైపు వెళ్లే వాహనాలకు సులభంగా మార్గం ఏర్పడుతుంది. ప్రజా ప్రయోజనాల కోసం ఇలాంటి ఉదార నిర్ణయాలు తీసుకోవడం, భూమి ఇవ్వటానికి బాలకృష్ణ వంటివారు ముందుకు రావటం హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య నుండి బిగ్ రిలీఫ్ ఇస్తుంది.













Click it and Unblock the Notifications
