కొత్త పెన్షన్ లకు అప్లై చేసుకున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!
తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వం కొత్తగా 2 లక్షల 50 వేల పెన్షన్ లు మంజూరు చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకుని దరఖాస్తులను ఆహ్వానించింది. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా, తలసేమియా, సికిల్ సెల్, హిమోఫిలియా బాధితులుదరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ప్రస్తుత దశలో వృద్ధాప్య పెన్షన్, హెచ్‌ఐవీ బాధితులు, బీడీ కార్మికులు చేర్చబడలేదు. ఇక రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిగా ఇంకా పెన్సన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.
గ్రామీణాభివృద్ధి శాఖ క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో చేయూత సామాజిక భద్రత పించన్ ల పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి పెన్షన్లు వేగంగా అందించే లక్ష్యంతో గ్రామీణాభివృద్ధి శాఖ క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. దరఖాస్తుల స్వీకరణతో పాటు వెరిఫికేషన్‌ను సమాంతరంగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు మండల, మున్సిపల్, సర్కిల్ స్థాయిల్లో ప్రత్యేక అధికారులను నియమించారు.

చేయూత వెరిఫికేషన్ మొబైల్ యాప్'ను ఉపయోగించాలని అధికారులకు సూచన
వీరు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వారి వివరాలు, అర్హత పత్రాలు, కుటుంబ పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ సమయంలో తప్పనిసరిగా అధికారులు అడిగిన ధ్రువ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. పరిశీలనను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన 'చేయూత వెరిఫికేషన్ మొబైల్ యాప్'ను ఉపయోగించాలని అధికారులకు సూచించారు.
25వ తేదీలోగా మొత్తం వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చెయ్యాలని ఆదేశం
ఈ యాప్‌లో దరఖాస్తుదారుల వ్యక్తిగత వివరాలు, జతచేసిన పత్రాలు, స్థానిక పరిశీలన నివేదికలను నేరుగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 25వ తేదీలోగా మొత్తం వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారుల జాబితాను సంబంధిత జిల్లా కలెక్టర్ ఆమోదానికి సమర్పించాలని ఆదేశాలు ఉన్నాయి. కలెక్టర్ ఆమోదం అనంతరం మంజూరు ఉత్తర్వులు సిద్ధం చేసి లబ్ధిదారులకు అందజేస్తారు.
త్వరలోనే కొత్త పెన్షన్ లు
ఈ చర్య ద్వారా అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తదితరులకు పెన్షన్ లబ్ధి త్వరగా అందుతుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా కొత్త పెన్షన్ ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు త్వరలోనే కొత్త పెన్షన్ లను అందుకోనున్నారు.












Click it and Unblock the Notifications