Viral Video : గ్రామస్తుల కోసం ఎవరూ చేయని రిస్క్ చేసిన లింగాపూర్ సర్పంచ్
మాట ఇచ్చాక.. ఆ హామీని నిలబెట్టుకునే విషయంలో ఎన్ని ఆటంకాలు ఎదురైన వెనుకడుగు వేయకుండా దాన్ని నిలబెట్టుకుంటారు కొంతమంది వ్యక్తులు. ఇప్పుడు మనం చూస్తున్న వ్యక్తి కూడా ఇదే కోవకు చెందుతారు అనడంలో సందేహం అక్కర్లేదు. సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి రిస్క్ చేసి మరీ సక్సెస్ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
అసలేం జరిగిందంటే..?
నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామంలో మూడేళ్లుగా కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోతులను తరిమికొట్టేందుకు గతంలో ఎన్ని ప్రయత్నాలు చేశారు. గత ఏడాది గ్రామమంతా ఏకమై చందాలు వేసుకుని మరీ బోనులు ఏర్పాటు చేశారు. అవి అన్నీ ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోయాయి. అయితే సర్పంచ్ ఎన్నికల్లో గ్రామస్థులు అంతా ప్రధాన డిమాండ్‌గా ఈ విషయాన్ని తెర మీదకు తెచ్చారు. ఎవరు గెలిచినా కోతులను వెంటనే వెళ్లగొట్టాలని స్పష్టం చేశారు.

ఈ మేరకు కొత్తగా గెలిచిన సర్పంచ్ రంజిత్ గ్రామ ప్రజలకు కోతుల నుండి విముక్తి కలిగించడం కోసం రిస్క్ చేశారు. కోతులను తరిమేందుకు ఏకంగా ఎలుగుబంటి వేషం వేసుకుని గ్రామంలో తిరిగాడు. అలా ఎలుగుబంటి కనిపించడంతో కోతులు పరారయ్యాయి. ఊరంతా తిరుగుతూ గల్లీ గల్లీలోని కోతులను ఊరి నుంచి తరిమేశాడు. ఇలా వినూత్న ఆలోచనతో కోతుల బెడదను తగ్గించిన యువ సర్పంచ్‌ను గ్రామస్తులు సైతం మెచ్చుకుంటున్నారు. అయితే మళ్లీ కోతులు వస్తే కొత్త అవతారం ఎత్తేందుకు సైతం సిద్దమంటూ చెబుతున్నారు ఈ కొత్త సర్పంచ్.
మొదట కొత్త సర్పంచ్ వినూత్న వేషధారణ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గెలిచిన మరుసటి రోజే ఎలుగు బంటి వేషం వేయడం ఏంటని షాక్ అయినా.. ప్లాన్ వర్కౌట్ అయ్యి కోతులు పరారవ్వడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. యూట్యూబ్ లో చూసి ఇలా వేషం వేయాలి అనుకున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications