తెలంగాణలో ఐదురోజులపాటు తీవ్ర వడగాలు: ఈ జిల్లాలకు హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలో రాగల ఐదురోజుల పాటు వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఎండలు, వడగాలుల ఎక్కువగా ఉండటంతో అత్యవసరమైతే తప్ప ఎవరూ ఉదయం 11 నుంచి సాయంత్రం వరకు బయటకు రావొద్దని హెచ్చరించింది.
రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కారణంగా ఉష్ణోగ్రతుల పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, ఆదివారం నుంచి సోమవారం వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

శుక్రవారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వనపర్తి జోగులాంబ జిల్లాల్లో.. శనివారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వడగాలులు వీస్తాయంటూ వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఏప్రిల్ 28న నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు వడగాలులు వీస్తాయంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ అవగా.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఆదివారంనాడు కుమురంభీం, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 29న నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలు, 30న కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు వడగాలలు వీస్తాయని చెప్పింది.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో సోమవారంనాడు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అవకాశాలు కురిసే ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications