ఏడోరోజు వేపకాయల బతుకమ్మ.. ప్రత్యేకత ఏమిటంటే!!
తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. తొమ్మిది రోజులు పాటు సాగే బతుకమ్మ పండుగలో మహిళలు సంతోషంగా బతుకమ్మలను పేర్చి ఆడి పాడి, బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేసి గౌరమ్మను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
ప్రకృతిని పూజించే పండుగ అయిన బతుకమ్మ పండుగ తెలంగాణను ప్రత్యేకంగా నిలబెట్టే పండుగ. తెలంగాణ రాష్ట్రంలోని ఆడబిడ్డలంతా కలిసి ఇల్లంత సందడి చేసే పండుగ. ప్రకృతిలోని పూలను సేకరించి దొంతరలుగా పేర్చి, గౌరమ్మను పెట్టి, అత్యంత భక్తితో పాటలు పాడుతూ భక్తి సౌరభాలను గుభాళింపజేసే పండుగ.

తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ పండుగలో తొలినాడు ఎంగిలిపూల బతుకమ్మను నిర్వహిస్తారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవరోజు ముద్దపప్పు బతకమ్మ, నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ నిర్వహిస్తారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మగా బతుకమ్మను పేర్చరు. మళ్లీ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మతో బతుకమ్మను ఘనంగా జరుపుకుంటారు.
తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ పండుగలో భాగంగా ఏడవ రోజు వేపకాయల బతుకమ్మను నిర్వహిస్తారు. నేటి వేపకాయల బతుకమ్మ లో భాగంగా వేప చెట్టుని ఆదిపరాశక్తి కి ప్రతిరూపంగా భావించి, ఆ ఆదిపరాశక్తి కి నిరాజనాలు సమర్పిస్తూ వేపకాయల బతుకమ్మను పూజిస్తున్నారు. వేపకాయల బతుకమ్మ పండుగ రోజు చామంతి, గునుగు, తంగేడు, గులాబీ పూలతో ఏడు దొంతరలుగా బతుకమ్మను పేరుస్తారు.
సకినాలు తయారు చేయడానికి ఉపయోగించే పిండితో చిన్న వేప పండ్లు ఆకారంలో చిన్న ముద్దలు చేసి బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు. అంతేకాదు పప్పు బెల్లాన్ని కూడా నైవేద్యంగా ఏడవ రోజు సమర్పిస్తారు. వేపకాయల బతుకమ్మ లో భాగంగా ఉదయం బతుకమ్మలను పూజించిన వారంతా, సాయంత్రం పూట బతుకమ్మని ఇంటి ముంగిట్లో పెట్టి అంతా కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ ఆడతారు.
ఆ తర్వాత బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేసి నైవేద్యాన్ని అందరూ పంచుకుంటారు. ఇలా ఏడవ రోజు ఏడు అంతరాల బతుకమ్మ గంగమ్మ చెంతకు చేరుతుంది. ఇంకా మిగిలిన రెండు రోజులు బతుకమ్మ ఆటలకు తెలంగాణా ఆడపడుచులు రెడీ అవుతారు. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ సంబరాలకు సిద్ధం అవుతారు.












Click it and Unblock the Notifications