Operation Kagar వేట ఫలించింది: కేంద్రం టార్గెట్ ఫినిష్?
భారత అంతర్గత భద్రత చరిత్రలో ఇదొక చారిత్రాత్మక మలుపు. దశాబ్దాలుగా దండకారణ్యం అంచున తుపాకీ గొట్టం ద్వారా సవాలు విసిరిన మావోయిస్టు అగ్ర నాయకత్వానికి శవపేటికలో చివరి మేకు పడింది. కేంద్ర ప్రభుత్వం అత్యంత రహస్యంగా, పకడ్బందీగా అమలు చేసిన 'ఆపరేషన్ కగార్-2' (Operation Kagaar-2) ఉచ్చులో మావోయిస్టు పార్టీ మేధావులు చిక్కారు. పార్టీకి వెన్నెముక వంటి సెక్రటరీ జనరల్ దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి... వ్యూహకర్త, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డితో సహా 16 మంది తెలంగాణ ఎస్ఐబీ ముందు మోకరిల్లడం.. ఎర్ర జెండా కోట కుప్పకూలిందని చెప్పడానికి నిదర్శనం.
'కగార్' అంటే అంచు అని అర్థం.. అంటే నక్సలిజాన్ని అంతం చేసే అంచుకు తీసుకురావడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశ్యం. కేంద్ర హోం శాఖ 2026 మార్చి 31 నాటికి దేశాన్ని 'నక్సల్ రహిత భారత్'గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కేవలం కింది స్థాయి క్యాడర్‌పైనే కాకుండా, పార్టీకి దిశానిర్దేశం చేసే అగ్ర నేతలపై 'సర్జికల్ స్ట్రైక్' వంటి ఒత్తిడిని భద్రతా బలగాలు పెంచాయి. అడవులను జల్లెడ పట్టడం, అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీతో కదలికలను కనిపెట్టడం ద్వారా నాయకత్వానికి మరియు క్యాడర్‌కు మధ్య ఉన్న సంబంధాలను ఆపరేషన్ కగార్ తెంచేసింది.

Operation Kagar దెబ్బకు ఉక్కిరిబిక్కిరి
ఈ ఆపరేషన్ దెబ్బకు మావోయిస్టు అగ్ర నాయకత్వం ఉక్కిరిబిక్కిరి అయింది. అడవిలో మనుగడ కష్టమవ్వడం, ఒకవైపు అనారోగ్య సమస్యలు, మరోవైపు కంటిమీద కునుకు లేకుండా వెంటాడుతున్న వేటగాళ్లలాంటి జవాన్లు.. వెరసి దేవ్ జీ, రాజిరెడ్డి వంటి ఉద్ధండులు కూడా ఆయుధాలు విడిచిపెట్టక తప్పలేదు. వీరిద్దరిపై కోట్లాది రూపాయల రివార్డు ఉండటమే కాదు, వీరు లొంగిపోవడం అంటే పార్టీలోని మొత్తం డేటాబేస్ మరియు భవిష్యత్తు ప్రణాళికలు పోలీసుల చేతికి చిక్కినట్లే. ఇది పార్టీకి తగిలిన మామూలు దెబ్బ కాదు.. వెన్నుముక విరిగిన పరిస్థితి.
భీకర ఎన్‌కౌంటర్, పదుల సంఖ్యలో నక్సల్స్ మృతి
గతంలో ఎందరో నేతలు లొంగిపోయినా, ఒక సెక్రటరీ జనరల్ హోదాలో ఉన్న వ్యక్తి ప్రభుత్వానికి తలవంచడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం ఈ ఆపరేషన్‌ను అత్యంత గోప్యంగా నిర్వహించింది. రాబోయే రెండు రోజుల్లో వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టినప్పుడు మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి 'ఆపరేషన్ కగార్' తన లక్ష్యాన్ని దాదాపు పూర్తి చేసింది.. దశాబ్దాల కాలంగా సాగుతున్న సాయుధ పోరాటం ఇప్పుడు అంతిమ ఘట్టానికి చేరుకుంది.












Click it and Unblock the Notifications
