టీజీఎస్ఆర్టీసీలో 3వేలకుపైగా ఉద్యోగాలు, త్వరలో నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC)లో భారీగా ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 3,038 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని.. త్వరలోనే నోటిఫికేషన్ వేయడంతోపాటు సాధ్యమైనంత త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నామని మంత్రి పొన్నం ఈ సందర్భంగా గుర్తు చేశారు. తద్వారా ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని, ఇప్పటి వరకు ఆర్టీసీలో 165 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని మంత్రి పొన్నం తెలిపారు. అంతేగాక, మహాలక్ష్మి కోసం కొత్త బస్సులు కొనుగోలు చేశామన్నారు.

ఇప్పుడు ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ సన్నద్ధమైందని మంత్రి పొన్నం తెలిపారు. మొత్తం 3,038 ఉద్యోగాల్లో 2,000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) పోస్టులు, 114 డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్) పోస్టులు, 25 డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టులు, 18 అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ పోస్టులు, 23 అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు, 11 సెక్షన్ ఆఫీసర్ ( సివిల్) పోస్టులు, 6 అకౌంట్ ఆఫీసర్స్ పోస్టులు, 7 మెడికల్ ఆఫీసర్స్ జనరల్ పోస్టులు, 7 మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయని వివరించారు.
ఈ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రజా పాలన ప్రభుత్వంలో దాదాపు 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్లను క్యాలెండర్ ప్రకారం విడుదల చేయనున్నామని తెలిపారు. ఈ అవకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
గతంలో ఆర్టీసీ ఉద్యోగాలు భర్తీ చేయాలని భావించినప్పటికీ.. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఆర్టీసీ ఉద్యోగాల నోటిఫికేషన్ ఆలస్యమైందని మంత్రి తెలిపారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి, ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. టీజీఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ జరుగుతుండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్.












Click it and Unblock the Notifications