పింక్ పవర్ రన్ 3.0 : పరుగులో పోటీ పడండి.. రూ.75లక్షల ప్రైజ్ లు గెలుచుకోండి!
ఆరోగ్యం, ఫిట్‌నెస్, మహిళల ఆరోగ్యంపై అవగాహన, సామాజిక సేవ లక్ష్యంగా నిర్వహిస్తున్న 'పింక్ పవర్ రన్' మూడో ఎడిషన్‌కు హైదరాబాద్ సిద్ధమవుతోంది. సుధా రెడ్డి ఫౌండేషన్, ఎంఈఐఎల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ హాఫ్ మారథాన్, కమ్యూనిటీ ఫిట్‌నెస్ కార్యక్రమంగా పింక్ పవర్ రన్ 3.0ను ఈ నెల 27న నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు. ఈసారి కార్యక్రమాన్ని మరింత భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పింక్ పవర్ రన్.. రూ.75 లక్షల ప్రైజ్ లు
20 వేల మందికి పైగా పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తుండగా.. మొత్తం రూ.75 లక్షల ప్రైజ్‌పూల్‌ను ప్రకటించారు. 100 మందికి పైగా విజేతలకు నగదు బహుమతులు అందించనున్నారు.పింక్ పవర్ రన్ లో పాల్గొనే ఔత్సాహికులు పేర్లు నమోదు చేసుకునే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.

టి షర్ట్, విజేతలకు అందచేసే మెడల్స్ విడుదల
ఈ మేరకు నేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో సుధా రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఎంఈఐఎల్ డైరెక్టర్ సుధా రెడ్డి, 2025 మిస్ వరల్డ్ ఒపల్ సుచతా చువాంగ్, బ్రెస్ట్ ఆంకోసర్జన్ డాక్టర్ ప్రజ్ఞ చిగురుపాటి పాల్గొన్నారు. రన్ లో పాల్గొనే వారు ధరించే టి షర్ట్, విజేతలకు అందచేసే మెడల్స్ విడుదల చేశారు. రన్ వివరాలను వెల్లడించారు.
హాఫ్ మారథాన్‌కు ఏఐఎంఎస్ ధ్రువీకరణ
ఫిట్‌నెస్‌ను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడంతోపాటు మహిళల ఆరోగ్యం, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచడం అత్యంత అవసరమని నిర్వాహకులు చెప్పారు. పింక్ పవర్ రన్ 3.0లో తొలిసారిగా అధికారిక 21.097 కిలోమీటర్ల హాఫ్ మారథాన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ హాఫ్ మారథాన్‌కు అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మారథాన్స్ అండ్ డిస్టెన్స్ రేసెస్ ధ్రువీకరణ లభించింది. దీంతో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న పింక్ పవర్ రన్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు మరింత పెరగనుంది.
ప్రముఖ అథ్లెట్ లు పాల్గొనే అవకాశం
హాఫ్ మారథాన్‌తోపాటు 10 కి.మీ., 5 కి.మీ., 3 కి.మీ. విభాగాల్లోనూ పరుగులు నిర్వహించనున్నారు. రూ.75 లక్షల భారీ ప్రైజ్‌పూల్ ఉండటంతో దేశంలోని ప్రముఖ అథ్లెట్లతోపాటు అంతర్జాతీయ స్థాయి రన్నర్లు కూడా ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్‌లో జరిగే ప్రధాన పరుగుతోపాటు పింక్ పవర్ రన్‌ను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు గ్లోబల్ వర్చువల్ రన్‌ను కూడా ప్రారంభించారు.
వర్చువల్ గా గ్లోబల్ రన్
ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్న ఫిట్‌నెస్ ఔత్సాహికులైనా తమ ప్రాంతం నుంచే ఇందులో పాల్గొనవచ్చు. ఇందుకు ఎలాంటి రిజిస్ట్రేషన్ రుసుము ఉండదు. భౌగోళిక హద్దులను దాటి ఆరోగ్యం, ఫిట్‌నెస్, ముందస్తు ఆరోగ్య పరీక్షలపై అవగాహన కల్పించడమే వర్చువల్ రన్ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.













Click it and Unblock the Notifications
