తెలంగాణాకు కేంద్రం ఊతం: మెగా టెక్స్‌టైల్ పార్క్ ప్రకటించిన ప్రధాని మోడీ
తెలంగాణ రాష్ట్రంలో టెక్స్ టైల్ రంగానికి మరింత ఊతం ఇచ్చేలా మెగా టెక్స్ టైల్ పార్క్ ప్రకటించారు ప్రధాని మోడీ.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని, తెలంగాణ రాష్ట్రానికి రావలసిన ఎన్నో సంస్థలను రాకుండా చేస్తుందని, రాష్ట్రంపై చిన్నచూపు చూస్తుందని పదేపదే బీఆర్ఎస్ వర్గాలు, మంత్రులు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూనే ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రానికి మేము సముచిత స్థానం ఇస్తున్నామని బిజెపి కూడా తన వంతుగా చెప్పేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి పీఎం మిత్ర మెగా టెక్స్ టైల్ పార్క్ ఇస్తున్నట్టు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో టెక్స్ టైల్ రంగానికి మరింత ఊతం ఇచ్చేలా ఫైవ్ ఎఫ్ దృష్టితో అంటే ఫార్మ్, ఫైబర్, ఫ్యాక్టరీ, ఫ్యాషన్, ఫారిన్ దృష్టితో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఏడు మెగా టెక్స్ టైల్ పార్కులను నెలకొల్పనున్నట్టు, అందులో తెలంగాణ రాష్ట్రానికి ఒకటి కేటాయించినట్టు మోడీ శుక్రవారం ట్వీట్ ద్వారా తెలిపారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో, లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా తెలంగాణ రాష్ట్రంలో టెక్స్ టైల్ పార్క్ ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ రాష్ట్రం తో పాటు తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ లలో కూడా ఈ మెగా టెక్స్ టైల్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. కోట్లాది రూపాయల పెట్టుబడులను ఆకర్షించి, లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వరంగల్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ మాటలకే కానీ, అనుకున్న లక్ష్యాలను ఇంకా సాధించలేకపోతుంది.

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి నిధులు కేటాయించాలని కేంద్రానికి అనేకమార్లు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇక ప్రస్తుతం మెగా టెక్స్ టైల్ పార్క్ ను తెలంగాణకు మంజూరు చేయడంతో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ నే తాజాగా కేంద్రం ప్రకటించిన టెక్స్ టైల్ పార్క్ గా మార్చి నిధులు తీసుకునే అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. మరి ఈ అవకాశాన్ని రాష్ట్రం ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటుంది అనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications