చంద్రబాబుకు పోలీసులు అనుమతి: కండీషన్స్ అప్లై
Revanth Reddy: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఒకే వేదికపై రాబోతోన్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు రేవంత్ రెడ్డి. చర్చలకు రావాలంటూ ఆహ్వానించారు.
విభజన సమస్యల పరిష్కారం దిశగా చంద్రబాబు తొలి అడుగు వేశారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డితో ముఖాముఖి భేటీకి ప్రతిపాదించారు. ఈ మేరకు ఇటీవలే ఆయనకు లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన శనివారం సమావేశమౌదామంటూ సూచించారు. విభజన సమస్యలను పరిష్కరించుకుందామని కోరారు.

ఈ లేఖకు రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు చంద్రబాబుకు రిప్లై ఇచ్చారు. కొద్దిసేపటి కిందటే ఈ లేఖను పంపించారు. చర్చలకు రావాలంటూ ఆహ్వానించారు. 6వ తేదీన శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాఫులే భవన్‌లో సమావేశమౌదామని చెప్పారు.
ఇందులో పాల్గొనడానికి చంద్రబాబు ఈ సాయంత్రం హైదరాబాద్‌కు రానున్నారు. ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆ హోదాలో హైదరాబాద్‌కు రావడం ఇదే తొలిసారి. దీనితో ఆయనకు ఘనంగా స్వాగతం పలకడానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వాగత ర్యాలీని నిర్వహించనున్నారు.
బేగంపేట్ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 65లో గల ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు ఈ స్వాగత ర్యాలీ కొనసాగుతుంది. దీన్ని నిర్వహించడానికి హైదరాబాద్ పోలీసులు అనుమతి ఇచ్చారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ర్యాలీని నిర్వహించేలా అనుమతులను జారీ చేశారు.
బేగంపేట్ విమానాశ్రయం వద్ద ఆరంభం అయ్యే ఈ ర్యాలీ పీ అండ్ టీ జంక్షన్- బేగంపేట్ ఫ్లై ఓవర్- ప్రజాభవన్- పంజాగుట్ట ఫ్లైఓవర్-, ముకరంఝా మీదుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో గల ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు చేరుకుంటుంది. కొన్ని నిమిషాల పాటు అక్కడ ఆగుతారు చంద్రబాబు.
పార్టీ తెలంగాణ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి, నివాళి అర్పిస్తారు. అనంతరం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 65కు స్వాగత ర్యాలీ చేరుకుంటుంది. ఈ ర్యాలీకి అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యదర్శి అజ్మీరా రాజు నాయక్ దాఖలు చేసుకున్న దరఖాస్తుకు హైదరాబాద్ పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు.
ర్యాలీ సందర్భంగా ఎలాంటి డ్రోన్లు గానీ, ఫ్లయింగ్ కెమెరాలను గానీ వినియోగించకూడదని పోలీసులు స్పష్టం చేశారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వకూడదని సూచించారు. నిర్ణీత సమయంలోగా ర్యాలీని ముగించాల్సి ఉంటుందని సూచించారు.












Click it and Unblock the Notifications