వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ మాటేమిటి?: సెంటిమెంట్ వేదికగా తొలుగుతున్న ముసుగు

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకించి అధికార రాజకీయాల్లో ఇప్పటి వరకు ఉన్న ముసుగు తొలగిపోతున్నది. దీనికి నిదర్శనం సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్‌తో సమావేశమైన నేపథ్యమే. 'నోట్ల రద్దును సమర్థించాం. నీతి ఆయోగ్‌ను స్వాగతించాం. కేంద్ర పథకాలన్నీ అమలు చేస్తున్నాం. అయినా, మాపై దాడి చేయడమేమిటి!?' అని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మండిపడ్డారు.

నోట్ల రద్దుపై బీజేపీపాలిత రాష్ట్రాల సీఎంలు కూడా మౌనం పాటించారని, అందరికంటే ముందే తాను నోట్ల రద్దుకు మద్దతు ఇచ్చానని, ప్రజలు ఇబ్బందులు పడినా నోట్ల రద్దుతో దేశానికి మేలు జరిగిందని వాదించి సమర్థించామని, ఇప్పుడు తెలంగాణపై దండయాత్ర చేసి.. బద్నామ్‌ చేస్తున్నారని ఆక్షేపించారు.

మూడు రోజులపాటు తెలంగాణలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలే లక్ష్యంగా చేసిన విమర్శలపైనే దాదాపు 90 నిమిషాల సేపు గవర్నర్‌తో జరిగిన భేటీలో సీఎం కేసీఆర్ చర్చించారని తెలుస్తున్నది. అంతే కాదు వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నామని సీఎం చెప్పినట్లు వస్తున్న వార్తల అంతరార్థమేమిటో ఏలిన వారికే తెలియాలి మరి.

మూడు దశాబ్దాల తర్వాత కేంద్రంలో ఏకపార్టీకి ఆధిక్యం

మూడు దశాబ్దాల తర్వాత కేంద్రంలో ఏకపార్టీకి ఆధిక్యం

మూడేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్, అటు టీడీపీ - బీజేపీ కూటమిపై బరిలో నిలిచి గెలిచిన నేపథ్యం తెలంగాణ రాష్ట్ర సమితిది. ఎన్నికల వేళ రెండు కళ్ల సిద్ధాంతం ప్రతిపాదించిన టీడీపీ అధినేత చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి ఓట్లేలా వేయాలని ప్రశ్నించిన నేపథ్యం టీఆర్ఎస్‌ది. సార్వత్రిక ఎన్నికల తర్వాత దాదాపు మూడు దశాబ్దాల అనంతరం కేంద్రంలో ఏక పార్టీకి సంపూర్ణ మెజారిటీ లభించింది. అదీనూ లోక్‌సభలో మాత్రమే సుమా.

మద్దతు సరే.. ఖమ్మంలో ఏడు మండలాల సంగతేమిటి?

మద్దతు సరే.. ఖమ్మంలో ఏడు మండలాల సంగతేమిటి?

2014 సార్వత్రిక ఎన్నికలు అందించిన విజయ స్ఫూర్తితో ప్రజలకు కొద్దిపాటి ఆసరాగానైనా ఉన్న 2013 భూసేకరణ చట్టాన్ని ఆర్డినెన్స్ ద్వారా పక్కకు నెట్టేసేందుకు విఫలయత్నం చేశారు ప్రధాని మోదీ. అంతే కాదు నాటి టీడీపీ అధినేత చంద్రబాబు లాబీయింగ్‌తో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన మోదీ సర్కార్‌కు ఏ ప్రాతిపదికన వ్యూహాత్మక మద్దతునిస్తున్నారో సీఎం కేసీఆర్.. తెలంగాణ సబ్బండ వర్ణాల ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అందునా టీఆర్ఎస్ మద్దతు ఏ కోశానా ప్రస్తుతానికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి అవసరం లేదు మరి.

1998 తర్వాత మారిన టీడీపీ అధినేత వైఖరి

1998 తర్వాత మారిన టీడీపీ అధినేత వైఖరి

1996 - 98 మధ్య యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ కూటమికి కన్వీనర్‌గా ఉన్న నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు 1998 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల వరకు లెఫ్ట్ పార్టీలతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. టీడీపీ మద్దతు అనివార్యమైన పరిస్థితి. మీడియాకు దూరంగా ఉండే నేతల ద్వారా రాజకీయం నడిపిన కమలనాథులు.. చంద్రబాబు మద్దతు కూడగట్టడంలో విజయం సాధించారు.

1999 తర్వాత బీజేపీకి వ్యూహాత్మక మద్దతు

1999 తర్వాత బీజేపీకి వ్యూహాత్మక మద్దతు

నాడు 1998లో ఎన్నికల ముందు వరకు లెఫ్ట్ పార్టీలతో కలిసి పనిచేసినందున చంద్రబాబు వ్యూహం బయట పెట్టకుండా తెర వెనుక రాజకీయం సాగించారు. నాడు చంద్రబాబు లోక్‌సభ స్పీకర్ పదవికి జీఎంసీ బాలయోగిని ఎంపిక చేయడం ద్వారానైనా బహిరంగంగానే కేంద్రంతో కలిసిపోతున్నట్లు సంకేతాలిచ్చారు. కానీ బయటికి మాత్రం షరతులతో కూడిన మద్దతునిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. కేంద్ర మంత్రి పదవులకు దూరంగానే ఉన్నారు. దీనికి కారణం ఉమ్మడి రాష్ట్రంలోని మైనారిటీలు, అల్ప సంఖ్యాక వర్గాల మద్దతు కోల్పోతామనే భయం ఉన్నది.

కేంద్రానికి టీఆర్ఎస్ మద్దతు బహిర్గతం ఇలా

కేంద్రానికి టీఆర్ఎస్ మద్దతు బహిర్గతం ఇలా

ఇప్పటివరకు వివిధ విధానాలు, అంశాలపై కేంద్రానికి పరోక్ష మద్దతు ప్రకటిస్తూ వచ్చిన సీఎం కేసీఆర్.. తాజాగా నల్లగొండ జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించడంతోపాటు తన సర్కార్‌పై విమర్శలు చేయడంతో సమాధానం చెప్పేందుకు వెంటనే మీడియా ముందుకు వచ్చారు. అంత వరకు బాగానే ఉన్నది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం చేసిన మంచి పనులను సమర్థించామని, అలాగని బీజేపీకి మద్దతునిచ్చినట్లు కాదని సమర్థించుకునేందుకు ప్రయత్నించారు.

కేంద్రానికి పరోక్షంగా సీఎం కేసీఆర్ అసమ్మతి

కేంద్రానికి పరోక్షంగా సీఎం కేసీఆర్ అసమ్మతి

తెలంగాణకు రూ. లక్ష కోట్ల నిధులు కేటాయించామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన ఆరోపణ నిజంగానే ఆక్షేపణీయమే. గత ఏడాది వచ్చినప్పుడు రూ.90 వేల కోట్లు తెలంగాణకు ఇచ్చామని పేర్కొన్నారు. దీనికి ప్రతిగా అమిత్ షా.. భాగ్య నగరాన్ని వీడక ముందే మీడియా ముందుకు వచ్చిన సీఎం కేసీఆర్ గణాంకాలతో సహా కేంద్రం నుంచి వచ్చిన నిధుల వివరాలు వివరించారు. అయినా అదీ రాష్ట్రానికి హక్కుగా వచ్చినవే తప్ప అప్పనంగా కట్టబెట్టలేదని గట్టిగానే రిటార్ట్ ఇచ్చారు. అంత వరకు బాగానే ఉన్నది. అమిత్ షా పర్యటన పూర్వాపరాలపై కేంద్రానికి ప్రత్యేకించి ప్రధాని నరేంద్రమోదీకి తన అసమ్మతిని తెలియజేయడానికి జరిగిన ప్రయత్నమే గురువారం సీఎం కేసీఆర్.. గవర్నర్ నరసింహన్ తో భేటీ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ప్రధానితో దోస్తీ.. అమిత్ షాతో కుస్తీ సాధ్యమా?

ప్రధానితో దోస్తీ.. అమిత్ షాతో కుస్తీ సాధ్యమా?

ఇప్పటివరకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్నానని చెప్తూ వచ్చిన సీఎం కేసీఆర్.. తాజాగా కేంద్రానికి వ్యూహాత్మక మద్దతునిచ్చామని చెప్పడం ద్వారా ఇప్పటి వరకు ఉన్న ముసుగు తొలగి పోయినట్లేనని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సూదిని జైపాల్ రెడ్డి ప్రశ్నించినట్లు ‘మోదీతో దోస్తీ.. అమిత్ షాతో కుస్తీ' ఎలా సాధ్యమో కల్వకుంట్ల వారే సెలవియ్యాలి మరి. జైపాల్ రెడ్డి మరో సంగతి చెప్పారు. సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో రహస్య అవగాహనతో పని చేస్తున్నారని కూడా చెప్పడం.. వ్యూహాత్మక మద్దతు ఇస్తున్నామని కేసీఆర్.. గవర్నర్ భేటీలో చెప్పినట్లు వచ్చిన వార్తకు సారూప్యత కనిపిస్తున్నది.

రాష్ట్రాలపై ఇలా అమిత్ షా విమర్శలు

రాష్ట్రాలపై ఇలా అమిత్ షా విమర్శలు

ఇదిలా ఉంటే ప్రధాని మోదీ టీమ్ ఇండియా మాదిరిగా సమాఖ్య స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేసుకోవాలని పిలుపునిస్తుంటే తమ ప్రభుత్వం తెలంగాణకు భారీగా నిధులు ఇచ్చిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పడం అంటే అంతకు మించిన అతిశేయోక్తి మరొకటి లేదు. అమిత్ షా మరో మాట కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. మరి అటువంటప్పుడు ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడ. 2014లో నాటి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ హామీ ఇచ్చిన మేరకు ‘ఎయిమ్స్' ఎక్కడ? ఫారెస్ట్ యూనివర్సిటీ మాత్రం ఇచ్చారు.

సాధారణ వాటా తప్ప ప్రత్యేక నిధుల ఊసే లేదు

సాధారణ వాటా తప్ప ప్రత్యేక నిధుల ఊసే లేదు

హర్షవర్ధన్ తెలంగాణ ఎంపీలు కవిత తదితరులకు హామీ ఇచ్చినందుకు తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో శాఖను కోల్పోయి శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖకు మళ్లిపోవాల్సి వచ్చింది. ఇటువంటప్పుడు అమిత్ షా అధ్యక్షుడిగా ఉన్న బీజేపీ నేత నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒనగూర్చిన మేలేమిటో అటు బీజేపీ నేతలు గానీ, ఇటు టీఆర్ఎస్ నేతలుగానీ చెప్పగలరా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అసలు ఆరోపణలు, ప్రత్యారోపణల సంగతి పక్కనబెడితే కేంద్రానికి రాష్ట్రాల నుంచే పన్నులు వెళతాయి. వాటిలో కొంత వాటా రాష్ట్రానికి వస్తుంది. దాన్నే తమ ఘనత అని చెప్పుకోవడం ఎంత వరకు కమలనాథులకే తెలియాలి మరి.

తాజాగా జీవోలతోనే భూసేకరణకు ఇలా

తాజాగా జీవోలతోనే భూసేకరణకు ఇలా

2013 భూసేకరణ చట్టానికి అనుకూలంగా నాడు లోక్ సభలో ఎంపీగా ఓటేసిన సీఎం కేసీఆర్.. తాజాగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టానికి ఆమోదం తెలిపి.. తానూ మిగతా పాలక పక్షాల మాదిరేనని నిరూపించుకున్నారు. ఆ మాటకొస్తే ఆచరణలో అసలు చట్టం అమలు ఊసే ఎత్తకుండా జీవోల జారీతోనే పని కానిచ్చేయాలని సంకల్పించారు. కానీ విపక్షాలు నిరంతరం న్యాయ పోరాటానికి దిగడంతో 2013 భూసేకరణ చట్టం వెలుగులో రాష్ట్ర స్థాయిలో ఒక చట్టం తీసుకొచ్చారు. అసలు కేంద్రంలో మెరుగైన చట్టం అమలులో ఉండగా, మరో చట్టం అవసరం లేదు. కానీ అయినా తీసుకొచ్చారంటే అందులో ఏదో మతలబు ఉండి తీరాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఇలా ఎయిమ్స్ కోసం నిరసన

ఇలా ఎయిమ్స్ కోసం నిరసన

నోట్ల రద్దుపై మద్దతు తెలిపిన టీఆర్ఎస్.. మూడేళ్లు కావస్తున్న తొలి ఏడాది ఇచ్చిన ‘ఎయిమ్స్' హామీ సాధన కోసం లోక్ సభ వేదికగా నిరసన తెలిపిన తర్వాతే 2017 - 18 ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. తెలంగాణకు ఎయిమ్స్ ఇస్తున్నామని లోక్ సభ సాక్షిగా ప్రకటన చేశారు. తర్వాత దాని అతీ గతీ లేదు. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం ఆరు ఎయిమ్స్ కళాశాలలు బడ్జెట్ ప్రసంగంలోనే చేర్చారు. మరి యూపీ రాజకీయంగా జాతీయ స్థాయిలో బీజేపీ బలోపేతానికి చేయూతనిస్తున్నది. ఇక్కడ ఇంకొక్క సంగతి చెప్పాలి. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులలోని పార్టీలు, ఎంపీలు తమ రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఉమ్మడిగా వ్యవహరిస్తారు. తమ మిత్రపక్షంతో ఘర్షణకు దిగేందుకు కూడా వారు వెనుకాడరని వివిధ సమయాల్లో తేలింది కూడా

కీలక అంశాలపై అఖిలపక్షాన్ని తీసుకెళ్లడంలో వెనుకంజ

కీలక అంశాలపై అఖిలపక్షాన్ని తీసుకెళ్లడంలో వెనుకంజ

2004 లోక్ సభ ఎన్నికల్లో యూపీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర క్యాబినెట్ లో చేరిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్.. ఉపరితల రవాణా శాఖ కేటాయించారు. కానీ దీనిపై డీఎంకే నేతలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇంకేముంది అలక పాన్పు ఎక్కేశారు. సీట్ల సర్దుబాటులో మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన రెడ్డి హామీ ఇచ్చారని డీఎంకే నాయకత్వం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ద్రుష్టికి తెచ్చింది. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్ఠానం ఉన్నప్పుడు తన శాఖను వదులుకున్న నేపథ్యం కేసీఆర్‌ది. తెలంగాణ సాధనే ధ్యేయంగా కేసీఆర్‌ ప్రకటించిన ప్రాథమ్యాలు అందరికీ సబబుగానే తోశాయి. కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సారథిగా.. చట్టపరంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సంస్థలు, అన్నీ రాబట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. రాష్ట్ర స్థాయిలో విపక్షాలు కలిసి రావాలని పదేపదే డిమాండ్ చేసే సీఎం కేసీఆర్... సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రముఖమైన దానికి జాతీయ హోదా.. ఇతర సాగునీటి ప్రాజెక్టులకు.. మిషన్ కాకతీయకు నిదులు కేటాయించాలని కోరుతూ అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకు వెళ్లలేకపోయారు? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అధికారంలో ఉన్నందున మెతక వైఖరి ప్రదర్శిస్తామంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రపతి ఎన్నికలపై రేపు తేలనున్నటీఆర్ఎస్ వైఖరి

రాష్ట్రపతి ఎన్నికలపై రేపు తేలనున్నటీఆర్ఎస్ వైఖరి

మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలాగే అవినీతి రహిత పాలన అందిస్తున్నామని, కడుపు నోరూ కట్టుకొని పని చేస్తున్నా అభాండాలు వేయడాన్ని తప్పుబట్టారు. కేంద్రానికి వ్యూహాత్మక మిత్రపక్షంగా ఉన్నా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమ ప్రభుత్వంపై దండయాత్ర చేయడం బాధ కలిగించిందని గవర్నర్ నరసింహన్ తో ఆయన అన్నట్లు సమాచారం. అమిత్ షా తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. ఈ సందర్భంగా, రాష్ట్రపతి/ఉప రాష్ట్రపతి ఎన్నికల అంశం చర్చకు వచ్చింది. బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నామని, శనివారం జరిగే టీఆర్‌ఎస్ఎల్పీలో విధాన నిర్ణయం ప్రకటిస్తామని గవర్నర్‌కు వివరించారు.

English summary
Telangana CM KCR irritated with BJP President Amit Shah allegations in recently Telangana tour while he had cleared his displeasure at Governer ESL Narasimhan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X