త్వరలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు.. బీ అలెర్ట్!
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే అదనంగా నాలుగు నుంచి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 10 దాటితే ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఉదయం 10 తర్వాత నుండి సాయంత్రం 3 గంటల వరకు రోడ్లు ఇప్పుడే నిర్మానుష్యంగా దర్శనం ఇస్తున్నాయి . ఇక ఇదే సమయంలో ఎండలు మండుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే విషయాన్ని వెల్లడించారు.
త్వరలో వర్షాలు
వాతావరణశాఖ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 22వ తేదీ నుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా హైదరాబాద్లో మార్చి 22వ తేదీ నుంచి మూడురోజుల పాటు వాతావరణం భిన్నంగా ఉంటుందని, ఇక తెలంగాణలోని పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, వడగండ్ల వానలతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

22 నుండి తీవ్ర తుఫాన్లకు ఛాన్స్
ఇక మార్చి 22వ తేదీన సెంట్రల్ నార్త్ తెలంగాణలో ప్రారంభమై, మార్చి 23వ తేదీ, 24వ తేదీన దక్షిణ తూర్పు తెలంగాణ వరకు విస్తరించే అవకాశం ఉందని తెలిపారు. తూర్పు తెలంగాణలో తీవ్రమైన తుఫాన్లు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈ జిల్లాలలో ఈదురుగాలులతో కూడిన తుఫాన్లు
మార్చి 22వ తేదీ మరియు మార్చి 23వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని ములుగు, మహబూబాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల్ లలో ఈదురు గాలులతో కూడిన తుఫానుకు అవకాశం ఉందని వెల్లడించారు. ఇక హైదరాబాద్ నగరం తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ జిల్లాలలో వడగండ్ల వాన
నిర్మల్, ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, హనుమకొండ, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, జనగామ, యాదాద్రి, సూర్యపేట, రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలలో వడగండ్ల వానలు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications