SLBC టన్నెల్ లో చిక్కుకున్న వారికోసం రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్లు.. వీరేం చేస్తారంటే!
మహబూబ్ నగర్ జిల్లా శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టన్నెల్ కుప్పకూలిన ఘోర ప్రమాద ఘటనలో 8 మంది కార్మికులు సొరంగంలోనే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి 48 గంటలు దాటినా ఇప్పటివరకు సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ లేదు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురావడానికి ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, ఆర్మీ , సింగరేణి బృందాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు.
రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్లు
దీంతో ఇప్పుడు ర్యాట్ హోల్ మైనర్లు రంగంలోకి దిగుతున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఆరుగురు ర్యాట్ హోల్ మైనర్లు టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ టీం 2023లో ఉత్తరకాశి సొరంగం దుర్ఘటన జరిగినప్పుడు 27 రోజుల సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత ఒకే ఒక్క రోజులో 41 మందిని బయటకు తీసుకువచ్చారు.

పక్క నుండి రంధ్రం చేసి లోపలికి వెళ్ళే ఎక్స్పర్ట్ లు
ఇట్లాంటి అతి క్లిష్టమైన పరిస్థితులలో పనిచేయగలిగిన ర్యాట్ హోల్ మైనర్ లను టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడడం కోసం రంగంలోకి దింపారు. అయితే లోపలికి వెళ్తే తప్ప పరిస్థితి ఏంటో చెప్పలేమని వారు చెప్తున్నారు. వీరు ఒక చిన్న రంద్రాన్ని చేసి పక్కనుంచి తవ్వుకుంటూ లోపలికి వెళ్లి ఖచ్చితమైన దారి తెలుసుకున్న తర్వాత అదే రంద్రాన్ని పెద్దది చేస్తూ బయటకు వచ్చేలా చేస్తారు.
ర్యాట్ హోల్ మైనర్లు అయినా లోనికి వెళ్తారా?
ఇది చాలా ప్రమాదకరమైన ఎక్స్పరిమెంట్ కావడంతో దీనిని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధించింది. ఇందులో టీం సభ్యుల ప్రాణాలకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని రాష్ట్రాలలో తప్పనిసరి పరిస్థితులలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. సొరంగం మట్టి, రాళ్లు నీటిని పరిశీలించి లోపలికి రంద్రం చేసుకుంటూ వెళ్ళగలరా లేదా అనేది ఈ టీం అంచనా వేస్తారు.
అవిశ్రాంతంగా వారిని వెలికి తీసేందుకు కృషి
ఏది ఏమైనా టన్నెల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడం కోసం రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. టన్నెల్ లో చిక్కుకున్న వారి కోసం అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. మంత్రులు సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకుపోయి రెండు రోజులు దాటిన నేపధ్యంలో వారు సజీవంగా ఉండటం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications