హోం గార్డుల విషయంలో రేవంత్ రెడ్డి కీలక హామీ!!
టిపిసిసిఅధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉన్నతాధికారుల ఒత్తిడి వల్లే హోంగార్డు రవీందర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించిన ఆయన, రవీందర్ భార్య చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ తమ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హోంగార్డులను క్రమబద్ధీకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రవీందర్ భార్య చేస్తున్న ఆందోళనకు హోంగార్డులు అందరూ వచ్చి మద్దతు తెలపాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హోంగార్డు రవీందర్ ను రాష్ట్ర ప్రభుత్వమే హత్య చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అప్పులతో బి ఆర్ ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించింది అని, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు హోంగార్డులకు కూడా జీతాలు ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. హోంగార్డ్ రవీందర్ పిల్లల చదువుల ఖర్చు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిజిపిని కోరినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.
అంతకుముందు సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి హోంగార్డ్ ఆత్మహత్యకు సంబంధించి ఘాటుగా లేఖ రాశారు . అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. హోంగార్డులు మరియు కానిస్టేబుల్స్ కష్టాల గురించి రేవంత్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డుల పరిస్థితి బాండెడ్ లేబర్ కంటే అధ్వానంగా తయారైందని రేవంత్ రెడ్డి విమర్శించారు.
ముఖ్యమంత్రి నుంచి వార్డు కౌన్సిలర్ దాకా బందోబస్తు కావాలంటే హోంగార్డు కావాలని కుటుంబాలను పట్టించుకోకుండా ప్రజలను, నాయకులను కంటికి రెప్పలా కాపాడుతున్న వారి సమస్యలను పరిష్కరించాలన్న సోయి కూడా ఏ ఒక్కరికీ లేకపోవడం బాధాకరమని రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక మంత్రి కానీ, అధికారి గాని దీనిపై మాట్లాడకపోవడం బాధాకరమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వ చేతగానితనం తోనే నిజాయితీపరుడైన ఒక హోంగార్డు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్య అని, దీనికి కెసిఆర్ బాధ్యత వహించాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హోంగార్డులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తుండగా వారికి ప్రభుత్వం నుండి వేధింపులు, సకాలంలో జీతం అందకపోవడం వంటివి బహుమానంగా దక్కుతున్నాయి అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.












Click it and Unblock the Notifications