సెలూన్ కష్టాలు: హెయిర్ కట్, షేవింగ్ లేక దేవదాసుల్లా పురుషులు
కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో సెలూన్ షాపులు,మెన్స్ బ్యూటీ పార్లర్లు కూడా బంద్ కోన సాగుతున్నాయి. ఇక దీంతో క్షురకులు లేక గత 22 రోజుల నుండి ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. అసలే ఎండా కాలం, ఆపై చిరాకు వెరసి మగమహారాజులు నరకం చూస్తున్నారు. హెయిర్ కట్ చేయించుకోవాలన్నా , షేవింగ్ చేయించుకోవాలన్నా ఎక్కడా సెలూన్లు కనిపించని పరిస్థితి . బార్బర్ ల కోసం బెంబేలు పడుతున్న జనాలు ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారు.

అందమంతా కరోనా పాలైందని దిగులు పడుతున్న మగమహారాజులు
కరోనా లాక్ డౌన్ తో అంతకు ముందు నీట్ గా షేవ్ చేసుకుని హెయిర్ డై వేసుకుని తిరిగిన వాళ్ళంతా ఇప్పుడు ఇళ్ళ నుండి బయటకు రావాలంటేనే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. తెగ పెరిగిన నెరిసిన జుట్టుతో బయటకు రావాలంటే గ్లామర్ దెబ్బ తిన్నట్టు ఫీల్ అవుతున్నారు . ఒక రకంగా చెప్పాలంటే తమ ముఖం తామే అద్దంలో చూసుకుని తెగ దిగులు పడుతున్నారు . తమను తామే పోల్చుకోలేకపోతున్నామని ఫీల్ అవుతున్నారు. ఇంత కాలం సెలూన్ల ఎఫెక్ట్ తో తాము అందంగా ఉన్నామని ఫీల్ అయిన వాళ్ళు ఇప్పుడు అందమంతా కరోనా పాలైందని తెగ దిగులు పడుతున్నారు.

ట్రిమ్మర్ లతో ప్రయోగాలు .. పిల్లలకు చిత్ర విచిత్రమైన కటింగ్ లు
ఇక కొందరు ప్రత్యామ్నాయంగా ఇంట్లో ఉన్న ట్రిమ్మర్ లకు పని చెప్తున్నారు. జుట్టు బాగా పెరిగి చిరాకు పడుతున్న పిల్లలకు ట్రిమ్మర్లతో హెయిర్ ట్రిమ్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పిల్లలే కదా వారికి ఎలా ఉన్నా నడుస్తుంది అని ఫీల్ అయ్యి వారికి ఒకరకమైన మిలట్రీ కటింగ్ చేస్తున్నారు. ఇక ఎవరైనా అదేమి కట్ అంటే కరోనా కట్ అంటూ చమత్కరిస్తున్నారు.ఇక చాలా మంది కుటుంబ సభ్యుల సహకారంతో తమ హెయిర్ స్టైల్ సెట్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు మరోమారు లాక్ డౌన్ పొడిగించటంతో జుట్టు బాగా పెరిగిన కొందరు తమ బతుకు స్వామీజీల్లా మారిపోతుందేమో అని తెగ బాధ పడుతున్నారు .

పెరిగిన జుట్టు , గడ్డాలు , మీసాలతో దేవదాసుల్లా మారుతున్న పురుషులు
లాక్ డౌన్ ఎఫెక్ట్ సెలూన్ల మీద కూడా ఉంది. సెలూన్లు , మెన్స్ పార్లర్లలో సామాజిక దూరం పాటించే అవకాశం ఉండదు . కటింగ్ చెయ్యాలంటే దగ్గరగానే ఉండాలి అలాంటి సమయంలో కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందని భావిస్తున్నారు . దీంతో సెలూన్లు, మెన్స్ పార్లర్లు కూడా బంద్ చెయ్యాలని నిర్ణయం తీసుకోవటంతో అవి కూడా బంద్ అయ్యాయి. ఒక పక్క కత్తెర చేతపడితే కానీ పొట్ట గడవని క్షురకులు పని లేక ఇబ్బంది పడుతుంటే , జుట్టు కట్ చేసే నాధుడు లేక జనాలు జుట్టు ,గడ్డాలు, మీసాలు పెంచి పిచ్చి వాళ్ళలా తయారవుతున్నారు. పెరిగిన జుట్టు , గడ్డాలు , మీసాలతో దేవదాసుల్లా మారుతున్నారు చాలా మంది పురుషులు .

సతీమణుల సహకారం తీసుకుంటున్న కొందరు భర్తలు .. జుట్టు బాగా పెరిగి ఇంటింటికీ స్వామీజీలు
కొందరు ఇళ్ళలో షేవింగ్ చేసుకుంటూ ఏదో తిప్పలు పడుతుంటే అది కూడా రాని వాళ్ళు జుట్టు బాగా పెరగటంతో చిరాకు పడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా సతీమణుల సహాయం తీసుకుంటున్నారు . చేతికి కత్తెర ఇచ్చి ఎలాగోలా పెరిగిన జుట్టు కాస్త నీట్ గా కట్ చెయ్యమని వేడుకుంటున్నారు . ఇక భర్తల చిరాకు చూడలేక భార్యలు భయం భయంగానే ప్రయోగాలు చేస్తున్నారు . నిన్నటి దాకా లాక్ డౌన్ ఎత్తి వేస్తే ఉపశమనం దొరుకుతుంది అని భావించిన వారికి ఇప్పుడు లాక్ డౌన్ పొడిగింపు అశనిపాతంగా మారింది . పెరిగిన జుట్టు, గడ్డాలు, మీసాలతో ఏ ఇంట్లో చూసినా దాదాపుగా స్వామీజీలే దర్శనం ఇస్తున్నారు .












Click it and Unblock the Notifications